Telugu Gateway
Politics

తెలంగాణ బిజెపికి షాక్

తెలంగాణ బిజెపికి షాక్
X

తెలంగాణ బిజెపిలో ఊహించని పరిణామం. బిజెపికి చెందిన వివాదస్పద ఎమ్మెల్యే రాజాసింగ్ అనూహ్యంగా పార్టీకి ఝలక్ ఇచ్చారు. గోషామహల్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు రాజీనామా పత్రాన్ని పార్టీ అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మణ్‌కు పంపించారు. తాను చేపట్టిన గో రక్షణ ఉద్యమానికి, పార్టీకి లింక్ పెడుతున్నారని, తన వల్ల పార్టీకి నష్టం జరగకూడదనే ఉద్దేశంతోనే రాజీనామా చేసినట్లు తెలిపారు. ఆదివారం రాజాసింగ్ మాట్లాడుతూ.. తాను నాలుగు రోజుల క్రితం తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడికి ఇచ్చానని చెప్పారు. తాను గో రక్షణ కోసం దేనికైనా సిద్ధమని ప్రకటించారు. తన గోరక్షణ ఉద్యమాన్ని పార్టీకి లింక్ పెట్టాలని కొందరు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన ఉద్యమానికి, పార్టీకి సంబంధం లేదని తేల్చి చెప్పారు. పార్టీకి, ప్రధాని నరేంద్ర మోదీకి ఇబ్బంది రాకూడదనే కారణంతోనే రాజీనామా చేసినట్లు స్పష్టం చేశారు. తెలంగాణ వచ్చాక యథేచ్చగా గోవులను అక్రమంగా తరలిస్తున్నారని మండిపడ్డారు. గోవుల అక్రమ రవాణను పోలీసులు ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. గోవుల అక‍్రమ రవాణా జరుగుతుంటే రవాణా మంత్రి ఏం చేస్తున్నారని ఈ సందర్భంగా ప్రశ్నించారు. దీన్ని తెలంగాణ ప్రభుత్వం అరికట్టాల్సిన బాధ్యత ఉందన్నారు. నిత్యం వివాదస్పద వ్యాఖ్యలతో రాజాసింగ్ సంచలనాలకు కేంద్ర బిందువుగా మారుతున్నారు.

గత కొంత కాలంగా తెలంగాణలో అధికార టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయం అని చెప్పుకుంటున్న బిజెపి..ఇప్పుడు ఇరకాటంలో పడిపోయింది. ఎందుకంటే ప్రధాని మోడీతో..సీఎం కెసీఆర్ సాన్నిహిత్యం ఆ పార్టీ నేతలకు మింగుపడని వ్యవహారంగా మారింది. దీంతో కెసీఆర్ సర్కారుపై ఇప్పుడు బిజెపి నేతలు గట్టిగా విమర్శలు చేయలేని పరిస్థితి. ఏపీలో ఏ మాత్రం బిజెపి ప్రస్తుతం రాజకీయంగా లబ్దిపొందే అవకాశం లేకపోయినా..అక్కడ రెచ్చిపోతున్న బిజెపి నాయకులు..తెలంగాణలో మాత్రం సైలంట్ అయిపోయారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. రాజకీయం ఏ మలుపులు తిరుగుతుందో.

Next Story
Share it