Telugu Gateway
Andhra Pradesh

సింధు ‘సంచలనం’

సింధు ‘సంచలనం’
X

తెలుగు తేజం సింధు సంచలన విజయం నమోదు చేసింది. ఈ విజయంతో ఏషియన్స్ గేమ్స్ లో సింధు ఫైనల్ లోకి ప్రవేశించింది. మరి ఈ సారి ఫైనల్ లో ఎలాంటి ఫలితాన్ని సాధిస్తుందో అన్న ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది. ఇప్పటికైతే వెండి పతకం ఖాయం. ఫైనల్ లో విజయం సాధిస్తే సింధు ‘బంగారం’ కానుంది. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్‌ సెమీ ఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంకర్‌ పీవీ సింధు 21-17, 15-21, 21-10 తేడాతో వరల్డ్‌ నంబర్‌ టూ యామగూచి(జపాన్‌)పై గెలిచి ఫైనల్లోకి ప్రవేశించింది. తొలి గేమ్‌ను పోరాడి గెలిచిన సింధు.. రెండో గేమ్‌ను కోల్పోయింది. దాంతో నిర్ణయాత్మక మూడో గేమ్‌ అనివార్యమైంది. ఈ గేమ్‌లో సింధు మంచి ఆట తీరు కనపర్చింది. ప్రధానంగా సుదీర్ఘమైన ర్యాలీతో ఆకట్టుకుని యామగూచి ఆటకట్టించింది. అదే సమయంలో ఏషియన్‌ గేమ్స్‌ లో మహిళల సింగిల్స్‌ లో ఫైనల్‌కు చేరిన తొలి భారత క్రీడాకారిణిగా సింధు మరో చరిత్ర తన పేరన లిఖించుకుంది.

మంగళవారం జరిగే పసిడి పతక పోరులో తై జు యింగ్‌(చైనీస్‌ తైపీ)తో సింధు తలపడనుంది. ఇదిలా ఉంటే మరొక సెమీ ఫైనల్లో భారత బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌కు నిరాశే ఎదురైంది. సైనా నెహ్వాల్‌ 17-21, 14-21 తేడాతో తై జు యింగ్(చైనీస్‌ తైపీ) చేతిలో పరాజయం పాలైంది. తొలి గేమ్‌లో పోరాడి ఓడిన సైనా.. రెండో గేమ్‌లో మాత్రం పూర్తిగా చతికిలబడింది. దాంతో వరుస రెండు గేమ్‌లతో పాటు మ్యాచ్‌ను చేజార్చుకుని ఏషియన్‌ గేమ్స్‌లో తొలిసారి ఫైనల్‌కు చేరే అవకాశాన్ని కోల్పోయింది. ఫలితంగా కాంస్యంతోనే సరిపెట్టుకుంది.

Next Story
Share it