Telugu Gateway
Andhra Pradesh

చంద్ర‌బాబు స‌ర్కారుకు ప్ర‌పంచ బ్యాంకు షాక్

చంద్ర‌బాబు స‌ర్కారుకు ప్ర‌పంచ బ్యాంకు షాక్
X

ఊహించ‌ని ప‌రిణామం. చంద్ర‌బాబు స‌ర్కారుకు ప్ర‌పంచ బ్యాంక్ షాకిచ్చింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ నూత‌న రాజ‌దాని అమ‌రావ‌తిలో మౌలిక‌స‌దుపాయాల క‌ల్ప‌న కోసం ఏపీ స‌ర్కారు ప్ర‌పంచ బ్యాంకు నుంచి 2000 కోట్ల రూపాయ‌ల‌పైన రుణం పొందాల‌ని త‌ల‌పెట్టింది. ఈ మేర‌కు కేంద్రం, ఏపీ స‌ర్కారు ఈ మేర‌కు ప్ర‌తిపాద‌న‌లు అంద‌జేశాయి. అయితే ఏపీ రాజ‌ధాని ప్రాంతం అమ‌రావ‌తిలో ల్యాండ్ పూలింగ్ కింద చేప‌ట్టిన భూసేక‌ర‌ణ వ‌ల్ల ప్ర‌భావితం అయ్యే అంశాల‌పై ప‌రిశోధ‌న చేయాల్సి ఉందా? లేదా అనే అంశంపై తొమ్మిది నెల‌ల్లో నిర్ణ‌యం తీసుకోవాల‌ని ప్ర‌పంచ బ్యాంకు టీమ్ నిర్ణ‌యం తీసుకుంది. దీంతో ఇప్ప‌ట్లో ఏపీ స‌ర్కారుకు రుణం మంజూరు అయ్యే అవ‌కాశం లేద‌ని ప్ర‌భుత్వ వ‌ర్గాలు చెబుతున్నాయి. తొమ్మిది నెల‌లు అంటే ఎటుచూసినా అసెంబ్లీ ఎన్నిక‌లు కూడా పూర్తి అయి..కొత్త ప్ర‌భుత్వం కొలువుదీర‌టం ఖాయంగా క‌న్పిస్తోంది. అమ‌రావ‌తిలో చేప‌ట్టిన 33 వేల ఎక‌రాల భూస‌మీక‌ర‌ణ, అక్క‌డ రాజ‌ధాని నిర్మాణం వ‌ల్ల ఆ ప్రాంతంలోని ప్ర‌జ‌ల జీవ‌నంపై...ప‌ర్యావ‌ర‌ణంపై ఎలాంటి ప్ర‌భావం ఉంటుంద‌నే అంశం మదింపుపై విచార‌ణ అవ‌స‌రమా? లేదా అన్న అంశంపై నిర్ణ‌యం తీసుకోవాల్సి ఉంది. కొంత మంది రైతులు ప్ర‌పంచ బ్యాంకు కు ఫిర్యాదులు చేయ‌టం వ‌ల్లే ఈ ప‌రిస్థితి ఏర్ప‌డింది. రైతుల నుంచి అందిన ఫిర్యాదులు...ప్ర‌పంచ బ్యాంకు ప్యాన‌ల్ మ‌దింపు అంశంపై స్ప‌ష్ట‌త వ‌చ్చే వ‌ర‌కూ ఈ రుణం వ్య‌వ‌హారం ముందుకు సాగే అవ‌కాశం లేదు.

ఈ అంశాన్ని ప‌రిశీలించే ప్యాన‌ల్ స్ప‌ష్ట‌మైన నివేదిక‌ను ప్ర‌పంచ బ్యాంకు బోర్డు ముందు పెడితేనే తుది నిర్ణ‌యం వెలువ‌డే అవ‌కాశం ఉంది. గ‌త ఏడాది సెప్టెంబ‌ర్ లో ప్ర‌పంచ బ్యాంక్ ప్యానల్ అమ‌రావ‌తిలో ప‌ర్య‌టించిన స‌మ‌యంలో కొంత మంది రైతులు బ‌ల‌వంతంగా త‌మ భూములు లాక్కున్నార‌ని..దీని వ‌ల్ల త‌మ జీవ‌నంపై ప్ర‌భావం ప‌డుతుంద‌ని ఫిర్యాదులు చేశారు. అప్పుడే ప్యాన‌ల్ దీనిపై ప‌రిశోధ‌న చేయాల్సి ఉంద‌ని...ఇది ప్ర‌పంచ బ్యాంకు నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా ఉంద‌ని అభిప్రాయ‌ప‌డింది.ఒక వేళ ప్ర‌పంచ బ్యాంకు క‌నుక ఈ వ్య‌వ‌హారంపై ప‌రిశోధ‌న చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని భావిస్తే మాత్రం రుణం మంజూరు మ‌రింత జాప్యం అయ్యే అవ‌కాశం క‌న్పిస్తోంది. ఓ వైపు కేంద్రంతో విభేదాలు..మ‌రో వైపు రాష్ట్రంలో ఆర్ధిక ఇబ్బందులు ఉన్నాయ‌ని స‌ర్కారు చెబుతున్న త‌రుణంలో ప్ర‌పంచ బ్యాంకు నిర్ణయం ఏపీ స‌ర్కారుకు పెద్ద షాక్ గా మార‌టం ఖాయంగా క‌న్పిస్తోంది.

Next Story
Share it