Telugu Gateway
Andhra Pradesh

‘ఉండవల్లి’ని పిలిచి బాబు పంపిన సందేశమేంటి?

‘ఉండవల్లి’ని పిలిచి బాబు పంపిన సందేశమేంటి?
X

ఉండవల్లి అరుణకుమార్. దివంగత సీఎం రాజశేఖరరెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఈ విషయం అందరికీ తెలిసిందే. పట్టిసీమ మొదలుకుని పోలవరానికి సంబంధించి ఉండవల్లి చంద్రబాబు సర్కారుపై తీవ్ర విమర్శలు చేశారు. పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపించారు. సందర్భంగా చిక్కినప్పుడల్లా చంద్రబాబు సర్కారు లోపాలను ఉండవల్లి ఎండగడుతూనే ఉంటారు. అయినా సరే ఏపీ సీఎం చంద్రబాబు అవన్నీ మర్చిపోయి...మాజీ ఎంపీ ఉండవల్లిని పిలిచి సలహా అడగటం వెనక ఉన్న ‘రాజకీయ కోణం’ ఏమిటి?. దేశంలోనే అందరికంటే తానే సీనియర్ అని ‘సెల్ఫ్ క్లెయిం’ చేసుకునే చంద్రబాబుకు ఉండవల్లి సలహాలు కావాలా?. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి ఉండే యంత్రాంగం...వ్యవస్థ, వనరులు అన్నీ ఇన్నీ కావు. అలాంటిది ఉండవల్లిని తానే స్వయంగా ఆహ్వానించటం ద్వారా ప్రజలకు చంద్రబాబు రెండు సందేశాలు పంపినట్లు అయిందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అందులో ఒకటి రాష్ట్ర ప్రయోజనాల కోసం చంద్రబాబు ఎవరితో అయినా కలుస్తారని చెప్పటం.

రెండవది ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి తన తండ్రికి అత్యంత సన్నిహితుడు అయిన ఉండవల్లి వంటి వారిని కాదు..కదా ఎవరినీ పట్టించుకోరని సందేశం పంపటం. గత ఎన్నికల సమయంలోనూ చంద్రబాబు తన అవసరం కోసం పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి మరీ మద్దతు అడిగారు. ఇప్పుడు మాత్రం తిడుతున్నారు. అది వేరే విషయం. చంద్రబాబుకు ఆ పూటకు పని గడిస్తే చాలు..ఎవరు ఏమి అనుకున్నా పట్టించుకోరు?. ఇప్పుడు ఉండవల్లి విషయంలోనూ అదే సీన్. అసలు చంద్రబాబు స్వయంగా ఉండవల్లిని ఆహ్వానిచంటం ఏమిటి?. ఉండవల్లి రావటం ఏమిటి? అని చర్చ జరగటం చంద్రబాబుకు కావాలి. ఉండవల్లి పై టీడీపీ నేతలు చేసిన విమర్శలు కూడా ఎన్నో.

అయినా ఆయన అవేమీ పట్టించుకోకుండానే చంద్రబాబు పిలిచిన వెంటనే వెళ్ళారు. గతంలో ఓ సారి బహిరంగంగానే చెప్పారు కూడా. చంద్రబాబు పిలిచి ఏదైనా సలహా అడిగితే చెబుతానని. రాష్ట్ర విభజన జరిగి నాలుగు సంవత్సరాలుపైనే అయింది. ఈ దశలో విభజన బిల్లు అన్యాయం అనటం వల్ల ఒరిగేది ఏమీ ఉండదని చంద్రబాబుకు తెలియదా?. ఈ అంశాన్ని లేవనెత్తటం ఎన్నికల వేళ మళ్ళీ కొత్త సమస్యలను కొనితెచ్చుకోవటమే అవుతుంది. కానీ చంద్రబాబు మాత్రం రాజకీయం ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోరు అని చెప్పటానికి ఓ ఉదాహరణ మాత్రమే.

Next Story
Share it