Telugu Gateway
Telangana

తెలంగాణలో టీఆర్ఎస్ ‘ఉక్కిరిబిక్కిరి’!

తెలంగాణలో టీఆర్ఎస్  ‘ఉక్కిరిబిక్కిరి’!
X

తెలంగాణలో అధికార టీఆర్ఎస్ కు కష్ట కాలం మొదలైనట్లేనా?. చూస్తుంటే అవే పరిస్థితులు కన్పిస్తున్నాయి. సొంత పార్టీ నేతల తీరే ఇందుకు ప్రధాన కారణంగా మారబోతోంది. కొద్ది రోజుల క్రితం సిరిసిల్ల మునిసిపల్ ఛైర్మన్ పావని చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. కమిషన్లు తీసుకోమని మంత్రి కెటీఆరే చెప్పారని..రెండు శాతం కమిషన్లు తీసుకోవటం పెద్ద తప్పేమీ కాదన్నట్లు వ్యాఖ్యానించారు. అప్పటికప్పుడు ఆమెను పార్టీ నుంచి తొలగించారు. మళ్లీ తర్వాత చేర్చుకున్నారు. తాజాగా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఓ కౌన్సిలర్ కుమార్తెతో చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. ఆయన కూడా పలుమార్లు కెటీఆర్ పేరును యధేచ్చగా వాడేశారు. ఈ పరిణామాలపై అటు కెటీఆర్ కానీ..ఇటు ప్రభుత్వపరంగా ఎవరూ స్పందించిన దాఖలాలు లేవు. ప్రతి విషయంలో ట్విట్టర్ వేదికగా స్పందించే కెటీఆర్ తనకు ఇబ్బంది ఎదురయ్యే పరిస్థితులు వచ్చినప్పుడు మాత్రం మౌనవ్రతాన్నే పాటిస్తున్నారు. ఇంత కాలం కాంగ్రెస్ పార్టీ ఒక్కటే అధికార టీఆర్ఎస్ ను టార్గెట్ చేసేది. ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి తన ఎటాక్ ను ఎవరూ ఊహించని రీతిలో పెంచటంతో టీఆర్ఎస్ రాబోయే రోజుల్లో ఉక్కిరిబిక్కిరి కాకతప్పదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ తాజాగా కెసీఆర్ పై చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. కెసీఆర్ ఢిల్లీలో బిజెపితో..తెలంగాణలో మజ్లిస్ తో దోస్తీనా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ ముమ్మటికి తమకు శత్రుపక్షమే అని తేల్చిచెప్పారు. మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంటకరెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో కవిత నిజామాబాద్ ఎంపీగా గెలిస్తే..తన పేరు మార్చుకోవటంతోపాటు...రాజకీయాలకు స్వస్తి పలుకుతానని సవాల్ విసిరారు. వంద సీట్లు తెచ్చుకోవటం తర్వాత..ముందు నిజామాబాద్ ఎంపీ సీటు గెలవాలని వ్యాఖ్యానించారు. వాస్తవానికి నిజామాబాద్ లో ఎంపీ కవితకు ఇబ్బందికరంగానే ఉందని..అందుకే డీఎస్ పై నేతల ఫిర్యాదు వంటి అంశాలు తెరపైకి వచ్చినట్లు చెబుతున్నారు. మొత్తానికి ఓ వైపు కాంగ్రెస్, మరో వైపు బిజెపి, సొంత పార్టీ నేతల చర్యలతో రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ మరింత చిక్కుల్లో పడటం ఖాయంగా కన్పిస్తోంది.

Next Story
Share it