Telugu Gateway
Andhra Pradesh

‘జమిలి’ ఎన్నికల మద్దతుకు టీఆర్ఎస్ తంటాలు!

‘జమిలి’ ఎన్నికల మద్దతుకు టీఆర్ఎస్ తంటాలు!
X

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఎప్పటి నుంచో బిజెపి విషయంలో ‘సాఫ్ట్’గా వ్యవహరిస్తోందనే అభిప్రాయం అందరిలో ఉంది. సాక్ష్యాత్తూ బిజెపి సీనియర్ నేతలే ఢిల్లీలో మోడీతో..తెలంగాణలో మజ్లిస్ తో కలసి తిరుగుతున్నారని విమర్శలు కూడా చేస్తున్నారు. అయితే జమిలికి మద్దతు ఇస్తే అది కాస్తా ఎక్కడ మోడీ బాటలో ఉన్నారనే విమర్శలు వస్తాయనే అనుమానంతో ఆ పార్టీ ఎంపీ వినోద్ కుమార్ ముందే ఇది మోడీ ఏజెండా కాదని చెప్పేశారు. అందుకు ఏకకాలంలో ఎన్నికలపై చర్చ ఎప్పటి నుంచో ఉందనే వాదననూ వినోద్ కుమార్ తెరపైకి తెచ్చారు. అయితే ఇక్కడ ముఖ్యంగా ప్రస్తావించుకోవాల్సింది ఈ తరుణంలో లోక్ సభతో పాటు..దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఒకేసారి అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించటం దాదాపు అసాధ్యం. అయితే ఇదంతా వన్ నేషన్..వన్ ఎలక్షన్ కు తొలి అడుగు కింద ప్రధాని మోడీ అమలు చేస్తున్న ప్లాన్. దీనికి టీఆర్ఎస్, ముఖ్యమంత్రి కెసీఆర్ పచ్చ జెండా ఊపేశారు. ఈ ఏడాడి డిసెంబర్ లో ఎన్నికలు జరగనున్న రాజస్థాన్, మధ్యప్రదేశ్ ల్లో బిజెపి చాలా గడ్డు పరిస్థితిని ఎదుర్కోనుందని ఎప్పటినుంచే సంకేతాలు వస్తున్నాయి. అంటే డిసెంబర్ లో ఈ రెండు కీలక రాష్ట్రాల్లో బిజెపి ఘోర పరాజయం పొంది..తర్వాత అంటే ఏప్రిల్-మే నెలల్లో లోక్ సభ సార్వత్రిక ఎన్నికలకు వెళితే అది బిజెపికి శరాఘాతంగా మారే ప్రమాదం ఉంది.

ఈ ప్రమాదం నుంచి తప్పించుకునేందుకే పైన చెప్పిన రాష్ట్రాలతోపాటు...లోక్ సభతో పాటు..ఏడాది లోపు కాలపరిమితి ఉన్న అసెంబ్లీలను కలిపేసి తొలి దశ జమిలి పేరుతో లాగించేయాలనేది బిజెపి ప్లాన్. ప్రస్తుతం మోడీ, కెసీఆర్ ల మధ్య సంబంధాలు సాఫీగా ఉన్నందునే ఈ ప్రతిపాదనకు కెసీఆర్ రైట్ రైట్ చెప్పారు. మోడీతో పూర్తిగా చెడినందునే టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జమిలి ఎన్నికల ప్రతిపాదనను గట్టిగా విభేదిస్తున్నారు. ఈ విభేదాలు లేకపోతే అందరి కంటే గట్టిగా ఏకకాలంలో ఎన్నికల వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో మోడీ కంటే చంద్రబాబే ఎక్కువగా చెప్పేవారు. ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పరిస్థితులు కూడా చంద్రబాబుకు ఏ మాత్రం అనుకూలంగా లేకపోవటంతో టీడీపీ నో చెబుతోంది. తెలంగాణ సీఎం కెసీఆర్ మాత్రం ‘ఎస్’అంటున్నారు. అదే సమయంలో జమిలి ఎన్నికలకు ఓకే అన్నందున తమకూ..బిజెపికి ఎక్కడ లింక్ పెడతారో అని టీఆర్ఎస్ కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటోంది.

Next Story
Share it