Telugu Gateway
Andhra Pradesh

కాంగ్రెస్ తో పొత్తు..లాభనష్టాలపై టీడీపీ తర్జనభర్జన

కాంగ్రెస్ తో పొత్తు..లాభనష్టాలపై టీడీపీ తర్జనభర్జన
X

తెలంగాణలో ఓకే..ఏపీలో పరిస్థితి ఏంటి?. తెలుగుదేశం, కాంగ్రెస్ పొత్తు వ్యవహారం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్. తెలంగాణలో ఈ రెండు పార్టీల పొత్తు వల్ల ఇరువురికి లాభదాయకమే అన్న ఓ అంచనా ఉంది. అంతే కాదు..కాంగ్రెస్ గెలుపు కూడా సులభం అవుతుందని అంచనా వేసుకుంటున్నారు దీని వల్ల. అయితే చిక్కంతా ఏపీలోనే వస్తోంది. ఈ రెండు పార్టీల కలయికను ఏపీ ప్రజలు ఆమోదిస్తారా?. రాష్ట్రాన్ని విభజించిందే కాంగ్రెస్ పార్టీ కదా?. దీనికి తోడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా జరిగింది కదా?.. రాజకీయ అవసరాల కోసం పొత్తు పెట్టుకుంటే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందా?. వస్తే అది ఏ మేరకు ఉంటుంది. పొత్తు లాభమా? నష్టమా అన్న అంశాలపై అధికార టీడీపీ ఇప్పటికే ఓ అంచనాకు వచ్చే పనిలో పడిందని ఓ సీనియర్ నేత తెలిపారు. దీనికి సంబంధించి ఓ సర్వే కూడా జరుపుతున్నట్లు సమాచారం. అయితే ఇఫ్పటికే రెండు పార్టీల మధ్య పొత్తుకు సంబంధించిన సంకేతాలకు చేరుతున్నాయి.

ప్రస్తుతానికి కాంగ్రెస్ నేతలు పైపైకి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని వ్యతిరేకిస్తూ వ్యాఖ్యలు చేస్తున్నా..ఇవన్నీ ప్రజల కోసమే అన్న విషయం తెలిసిందే. నిజంగా చంద్రబాబుతో పొత్తుకు ఛాన్స్ లేకపోయినట్లే అయితే..ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ ప్రత్యేక హోదా కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా బంద్ నిర్వహిస్తుంటే...మేం బంద్ కు మద్దతు ఇవ్వం అంటూ కాంగ్రెస్ నేతలు ఎందుకు ప్రకటిస్తారు? ఈ మాత్రం రాజకీయం ఏంటో అర్థం చేసుకోవటం పెద్ద కష్టం కాబోదు. ఒంటరిగా బరిలోకి దిగితే చంద్రబాబుకు గెలుపు అవకాశాలు ఇంచుమించు లేనట్లే అని అంచనాకు వచ్చిన తర్వాతే చంద్రబాబు క్రమక్రమంగా కాంగ్రెస్ తో పొత్తుకు లైన్ క్లియర్ చేసుకున్నట్లు టీడీపీలో ప్రచారం జరుగుతోంది. పొత్తుకు మార్గం సుగమం చేసేలా అన్నట్లు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కూడా తాము అదికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని తీర్మానం చేసిన సంగతి తెలిసిందే.

Next Story
Share it