Telugu Gateway
Telangana

రాజకీయాలకు టీఆర్ఎస్ ఎమ్మెల్యే గుడ్ బై

రాజకీయాలకు టీఆర్ఎస్ ఎమ్మెల్యే గుడ్ బై
X

అవిశ్వాస తీర్మానాలు తెలంగాణలోని అధికార టీఆర్ఎస్ లో కాక పుట్టిస్తున్నాయి. పార్టీ పరువును బజారున పడేస్తున్నాయి. కొంత మంది బెదిరింపులకు దిగుతుండగా..మరికొంత మంది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు ఇదే అంశం ఓ ఎమ్మెల్యే రాజకీయాలకు గుడ్ బై చెపుతాననే పరిస్థితి తెచ్చిపెట్టింది. అయితే ఈ వివాదం టీ కప్పులో తుఫానులా ముగిసిపోతుందా?. లేక అలాగే కొనసాగుతుందా? వేచిచూడాల్సిందే. సోమవారం నాడు రామగుండం ఎమ్మెల్యే, ఆర్టీసీ ఛైర్మన్‌ సోమారపు సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను రాజకీయంగా రిటైర్మెంట్‌ తీసుకోవాలని నిర్ణయించుకున్నట్టు ఆయన ప్రకటించారు. పార్టీలో క్రమశిక్షణ కొరవడిందని పేర్కొన్నారు.

పార్టీలో ఎంతో మందిని ప్రోత్సహించానని, ఇపుడు వారే తనకు నష్టం చేసేలా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఏం నిర్ణయం తీసుకున్నా.. సింగరేణి కార్మికులకు ముందుగా చెప్పడం ఆనవాయితీ అని సోమవారం జరిగిన కార్మికుల గేట్‌ మీటింగ్‌ లో ఆయన స్పష్టం చేశారు. రామగుండం మేయర్ లక్ష్మీనారాయణపై పెట్టిన అవిశ్వాస తీర్మానంపై పార్టీ అధిష్టానం సీరియస్ అయింది. ఈ తీర్మానం ఉపసంహరించుకునేలా చూడాలని పార్టీ పెద్దలు సోమారపును ఆదేశించారు.అయితే ఆయన మాటను కార్పొరేటర్లు విన్పించుకునే పరిస్థితి లేకపోవటంతో ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటున్న సోమారపు రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటన చేయాల్సి వచ్చిందన్నారు. అయితే వాస్తవ పరిస్థితిని ఎమ్మెల్యే చెప్పేందుకు ప్రయత్నించగా..అది వినటానికి కూడా అధిష్టానం పెద్దలు సిద్ధంగా లేకపోవటం ఈ పరిస్థితికి దారితీసిందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Next Story
Share it