Telugu Gateway
Andhra Pradesh

చంద్రబాబుకు పంచాయతీ ఎన్నికలు పెట్టే దమ్ముందా?

చంద్రబాబుకు పంచాయతీ ఎన్నికలు పెట్టే దమ్ముందా?
X

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అటు ప్రభుత్వంపై..ఇటు ప్రతిపక్షంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతోపాటు మంత్రి నారా లోకేష్, ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ గా విమర్శలు గుప్పిస్తున్నారు. "ఆగస్టు 2 వ తేదీతో రాష్ట్రంలో పంచాయతీల గడువు ముగుస్తుంది. సకాలంలో ఎన్నికలుపెట్టి పాలక మండలిని ఏర్పాటు చేయకపోతే కేంద్రం నుంచి నిధులు రావు. ఎక్కడ ఎన్నికలుపెడితే ఓడిపోతామో అనే భయంతో ముఖ్యమంత్రి ఎన్నికలు నిర్వహించడం లేదు. దమ్ము ఉంటే పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించండి. జనసేన పోటీ చేసి సత్తా చూపిస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతామంటే వాటికీ ఎన్నికలు పెట్టరేమో? గ్రామాల్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఎక్కడో పాడేరు, అరకు అడవుల్లోనే కాదు... గోదావరి జిల్లాల్లో కూడా తాగు నీటి సమస్య తీవ్రంగా ఉంది. ఉండి నియోజకవర్గంలో చూస్తే చిన్న గొట్టంలోంచి వస్తున్న నీటిని పట్టుకొని తాగుతున్నారు.

అందులో ఎర్రలు కనిపిస్తున్నాయని బాధపడుతున్నారు. చుట్టూ నీళ్లు కనిపిస్తున్నా తాగేందుకు ఉపయోగపడవు. టిన్నులు కొని తాగాలి. గ్రామాల్లో సరైన రోడ్లు లేవు. ఎస్సీ, ఎస్టీ ప్రజలు డ్రైన్లు, మురుగు కాల్వల పక్కన ఇబ్బందికర పరిస్థితుల్లో ఇళ్లు కట్టుకొని ఉంటున్నారు. మరి ముఖ్యమంత్రి, వారి అబ్బాయి లోకేష్ ఏం చేస్తున్నారు. మేము రోడ్లు వేశాం అని చెప్పుకొంటున్నారు. ఒక్క పశ్చిమ గోదావరిలో ఆక్వా రంగం నుంచే రూ. 15 వేల కోట్లు ఆదాయం వస్తుంది. అయినా ఈ జిల్లాను అభివృద్ధి చేయడం లేదు. ఇసుక దోపిడీ, మట్టి మాఫియా, భూ దోపిడీలతో తెలుగుదేశం, వైసిపి నాయకుల అవినీతి యనమదుర్రు డ్రైన్ కంపులా ఉంది అని పవన్ తీవ్ర విమర్శలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 15 కి 15 అసెంబ్లీ స్థానాల్నీ సంపూర్ణంగా గెలిపించి ఇచ్చినా జిల్లాకి తెలుగు దేశం ప్రభుత్వం ఏమీ చేయలేదు అన్నారు. అన్నపూర్ణగా పేరుగాంచిన పశ్చిమ గోదావరి జిల్లా ఇప్పుడు పారిశ్రామిక కాలుష్యంతో కనీసం తాగేందుకు చుక్క నీటి కోసం తపించాల్సిన దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. పబ్లిక్ పాలసీల గురించి మాట్లాడి అసెంబ్లీకి వెళ్ళమంటే ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి నాపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు.

ఈ భీమవరం పట్టణానికి డంపింగ్ యార్డ్ పెట్టించి నాపై వ్యక్తిగత విమర్శలు చేయండి. యనమదుర్రు డ్రైన్ బాగు చేసో, తాగు నీరు ఇచ్చో నాపై వ్యక్తిగత విమర్శలు చేయండి... భరిస్తా. అదేమీ చేయరు. అసెంబ్లీలో ఉండి ప్రభుత్వంపై పోరాడి సమస్యలు పరిష్కరించడం ప్రతిపక్ష నేత బాధ్యత. దాన్ని వదిలిపెట్టి పారిపోయారు. ఆయనకు ముఖ్యమంత్రిని ఎదిరించే ధైర్యం లేదు. ఆ దమ్ములేకపోవడంతోనే పారిపోయారు. ముఖ్యమంత్రి అయితేనే చేస్తాను అంటారు. వ్యక్తిగత విమర్శలు నేను కూడా చేస్తే తట్టుకోలేరు. నాకు సంస్కారం ఉంది. ఆయనలా కుసంస్కారిని కాదు. ఎవరు యూనివర్సిటీలో తువ్వాలుతో ఎందుకు తిరిగారో తెలుసు. కానీ చెప్పను. నాకున్న నెట్ వర్క్ కి ఎవరు ఎక్కడ ఏం చేస్తున్నారో చెప్పగలను. నా వ్యక్తిగత జీవితం తెరిచిన పుస్తకం. మంచో చెడో ఏదీ దాచేది లేదు. రహస్యాలు ఏమీ లేవు. వాళ్ళు చేసే ఫ్యాక్షనిజానికీ, గూండాగిరీకీ భయపడేది లేదు. బాంబులు, వేటకొడవళ్లు, బరిసెలకు భయపడను.

Next Story
Share it