Telugu Gateway
Movie reviews

‘పంతం’ మూవీ రివ్యూ

‘పంతం’ మూవీ రివ్యూ
X

టాలీవుడ్ లో కాలం కలసి రాని హీరోల్లో గోపీచంద్ ఒకరు. నటనకు నటన..హావభావాలు వ్యక్తీకరించకలిగే నటుల్లో ఒకరు ఈ హీరో. కానీ ఆయనకు విజయాలు ముఖం చాటేస్తున్నాయి. ఈ తరుణంలో ప్రతిష్టాత్మక 25వ చిత్రంగా ‘పంతం’ గురువారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో గోపీచంద్ కు జోడీగా తొలిసారి మెహరీన్ నటించింది. ఇక సినిమా అసలు కథ విషయానికి వస్తే గోపీచంద్ విదేశాల్లో అనేక వ్యాపారాలు ఉన్న సురానా గ్రూప్ సంస్థల అధినేత కుమారుడు. వ్యాపార పని మీద ఇండియాకు వచ్చి ఇక్కడే ఉండిపోతాడు. అంతకు ముందు గోపీచంద్ తల్లి కూడా ట్రస్ట్ ద్వారా పేదలకు సేవా కార్యక్రమాలు నిర్వహించేవారు. విదేశాల నుంచి వచ్చిన గోపీచంద్ కు ప్రమాదంలో చేతికి చిన్న గాయం అవుతుంది. ఆ సమయంలోనే పక్కనే బాంబు పేలుడు జరిగి క్షతగాత్రులను గోపీచంద్ వైద్యం చేయించుకున్న ఆస్పత్రికి తరలిస్తారు. ఆ సమయంలో బాధితులను చూసి చలించిన గోపీచంద్ బాధితులకు సాయంగా కోటి రూపాయల చెక్కును హోం మంత్రికి అందజేస్తారు.

అంతకు ముందే మంత్రి మరణించిన వారికి ఐదు లక్షల రూపాయల నష్టపరిహారం ప్రకటిస్తారు. కానీ ఈ నష్టపరిహారం ప్రజలకు అందకపోగా...తాను బాధితుల సాయం కోసం ఇచ్చిన కోటి రూపాయల చెక్ కూడా మంత్రి బినామీ ఖాతాకు వెళ్లిందని గోపీచంద్ గుర్తిస్తాడు. అప్పటి నుంచి మంత్రులు అవినీతితో దోపిడీ చేసిన డబ్బును ఎప్పటి కప్పుడు తస్కరిస్తూ ప్రజలకు వాటితోనే సౌకర్యాలు కల్పిస్తాడు. కానీ ఈ దోపిడీలు చేసేది ఎవరో తెలుసుకునే క్రమంలో గోపీచంద్ ను గుర్తిస్తారు. కానీ అవినీతి సొమ్మును కాజేసిన మంత్రులను అందరినీ కోర్టు మెట్లు ఎక్కిస్తాడు హీరో. అంతే కాదు..వీరి పదవులు కూడా పోతాయి. అయితే ఈ సినిమా కథ గతంలో వచ్చిన పలు సినిమాల తరహాలోనే సాగుతుంది. అయితే క్లైమాక్స్ లో వచ్చే సీన్లు..డైలాగ్ లు మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.

ప్రభుత్వం ఏదైనా పాలించేది అవినీతే..చివరకు ప్రజలకు దక్కాల్సిన ఎక్స్ గ్రేషియాల్లోనూ అవినీతి చేస్తున్న తీరును ప్రజంట్ చేసిన తీరు బాగుంది. ప్రస్తుత పొలిటికల్ సిస్టమ్ లో ఉన్న అవినీతిని కళ్ళకు కట్టినట్లు చూపెట్టడమే కాకుండా..ఓటర్లు కూడా ఓట్లు అమ్ముకుంటే పరిస్థితి ఇలాగే ఉంటుందని హెచ్చరించారు. పొలిటికల్ సిస్టమ్ పై గోపీచంద్ చెప్పిన డైలాగ్ లు ప్రేక్షకులకు కనెక్ట్ అవుతాయి. హీరోయిన్ మెహరీన్ కు ఇందులో చెప్పుకోదగ్గర పాత్రేమీ లేదు. పాటల సమయంలో..అప్పుడప్పుడు అలా మెరవటం తప్ప పెద్దగా చెప్పుకోదగ్గ సన్నివేశాలు లేవు. థర్టీ ఇయర్స్ పృథ్వీ రోల్ కూడా పెద్దగా నవ్వించలేకపోయింది. ఓవరాల్ గా చూస్తే గోపీచంద్ 25వ సినిమాగా తెరకెక్కిన ‘పంతం’ ఓ రొటీన్ సినిమాలాగే మిగిలింది.

రేటింగ్.2/5

Next Story
Share it