Telugu Gateway
Andhra Pradesh

టీడీపీలో ‘లోకేష్ కల్లోలం’

టీడీపీలో ‘లోకేష్ కల్లోలం’
X

ఒక్క దెబ్బకు తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేష్ తెలుగుదేశం పార్టీలో కల్లోలం సృష్టించారు. 2019 ఎన్నికలకు సంబంధించి తొలి అభ్యర్ధులను తానే ప్రకటించారు. ఆ అదృష్టం కూడా ‘ఫిరాయింపు’దారులకే దక్కింది. ఈ లెక్కన పార్టీ ప్రాధాన్యత ఎలా ఉండబోతుందో లోకేష్ చెప్పకనే చెప్పేశారు. అంటే లోకేష్ తన సొంత టీమ్ ను తయారు చేసుకునే పనిలో పడ్డారన్న మాట. సోమవారం నాడు కర్నూలులో పర్యటించిన మంత్రి లోకేష్ అక్కడే ఎంపీ బుట్టా రేణుక, ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డిని గెలిపించాలని పిలుపునివ్వటం ద్వారా తానే అభ్యర్ధులను ప్రకటించేశారు. దీని ద్వారా పార్టీలో పొలిట్ బ్యూరో మిథ్య. ఏపీ పార్టీ అధ్యక్షుడు కళా వెంకట్రావు నామ్ కే వాస్తే అని మరోసారి నిరూపించారు. ఏదైనా నేను...మా నాన్నే నిర్ణయాలు తీసుకుంటాం అని తేల్చేశారు. మిగతా అంతా అలా అలా చెప్పుకోవటానికే అని చాటిచెప్పారు. అయితే గతంలో చంద్రబాబు కూడా తన ఇష్టానుసారమే టిక్కెట్లు ఖరారు చేసేవారు. అయినా ప్రజాస్వామ్యయుతంగా చేశామని అందరూ అనుకోవాలని..పొలిట్ బ్యూరోలో పెట్టి మమ అన్పించేవారు. కానీ ఈ సంప్రదాయాలకు మంత్రి నారా లోకేష్ చెక్ పెట్టేశారు. నేరుగా 2019 ఎన్నికలకు సంబంధించి తొలి టిక్కెట్లను ప్రకటించేశారు.

మామూలుగా చంద్రబాబు సహజశైలి ఉంటుందంటే తాను పోటీచేసే కుప్పం నియోజకవర్గం పేరును కూడా చివరి జాబితాలోనే చేర్చేవారు. అలా ఉంటుంది ఆయన మోడల్. టిక్కెట్ల కేటాయింపు అంతా పార్టీలో ఏకాభిప్రాయంతో జరిగింది అని అప్పట్లో ప్రచారం చేసుకునే వారు. దీనికి సొంత పార్టీ నేతలే సరదాగా కౌంటర్ కూడా వేసేవారు. ఏకాభిప్రాయం అంటే..చంద్రబాబు ‘ఒక్కరి’ అభిప్రాయమే అని అర్థం చేసుకోవాలి అంటూ సెటైర్లు వేసేవారు. ఇప్పటికే పార్టీలో లోకేష్ మాటే ఫైనల్ అన్న పరిస్థితి నెలకొంది. చంద్రబాబు కూడా పార్టీ సీనియర్ నేతలు తన వద్ద ఏదైనా అంశాలను ప్రస్తావిస్తే లోకేష్ కు ఓ మాట చెప్పండని వ్యాఖ్యానిస్తున్నట్లు ఓ సీనియర్ నేత తెలిపారు. అయితే సోమవారం నాడు కర్నూలులో లోకేష్ చేసిన అభ్యర్ధుల ప్రకటన పార్టీ నేతలకు తప్పుడు సంకేతాలు పంపుతుందని టీడీపీ నేతలే అంగీకరిస్తున్నారు.

అయితే పార్టీ నేతల అభిప్రాయాలు ఎలా ఉన్నా..ఇక టిక్కెట్లు కావాలని కోరుకునే వారంతా చంద్రబాబును వదిలేసి..లోకేష్ చుట్టూ చేరటం ఖాయం అని చెబుతున్నారు. ఇప్పటికే అతి పెద్ద ‘పవర్ సెంటర్’గా మారిన లోకేష్..రాబోయే రోజుల్లో మరింత ‘కేంద్రీకృత’ వ్యవస్థను ఏర్పాటు చేసుకోనున్నారు. సీనియర్లు అన్న వారిని పక్కన పెట్టి తన మాట వినేవారికే లోకేష్ వచ్చే ఎన్నికల్లో ప్రాధాన్యత ఇఛ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. గతంలో మంత్రులకే అపాయింట్ మెంట్ ఇవ్వకుండా వేచిచూసేలా చేసిన లోకేష్..ఇక ఇప్పుడు టిక్కెట్లు ఖరారు చేసే పరిస్థితికి వచ్చారంటే పార్టీ రాజకీయాలు ఎటువైపు మారతాయో చూడాల్సిందే అంటున్నారు సీనియర్లు.

Next Story
Share it