Telugu Gateway
Movie reviews

‘లవర్’ మూవీ రివ్యూ

‘లవర్’ మూవీ రివ్యూ
X

దిల్ రాజు నిర్మాతగా ఓ సినిమా తెరకెక్కిస్తున్నాడు అంటే సహజంగానే దీనిపై అంచనాలు భారీగానే ఉంటాయి. ఎందుకంటే ఆయన గత సినిమాలు చూస్తే చాలా వరకూ హిట్సే. అక్కడక్కడ దెబ్బలు తగిలినా మెజారిటీ సినిమాలు మాత్రం ప్రేక్షకుల ఆదరణ పొందినవే. కానీ ఈ సారి మాత్రం టాలీవుడ్ లో గత కొంత కాలంగా సరైన హిట్ లేకుండా ఉన్న కుర్ర హీరో రాజ్ తరుణ్ ను హీరోగా పెట్టి ‘లవర్’ సినిమా తెరకెక్కించారు. ఇందులో రిద్ధికుమార్ తొలిసారి హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా అంతా ఓ ఆస్పత్రి చుట్టూ తిరుగుతుంది. అనంతపురంలోని ఆ ఆస్పత్రిలోనే చరిత (రిద్ధికుమార్) నర్సుగా పనిచేస్తుంది. అక్కడ ఎవరు కష్టాల్లో ఉన్నా... అన్యాయం జరిగినా ఆమె స్పందిస్తూ ఉంటుంది. ఆ ఆస్పత్రిలో వైద్యం పొందుతున్న ఓ బాలికకు ఉన్న అరుదైన రక్తాన్ని తస్కరించేందుకు వీలుగా అక్కడ చికిత్స పొందుతున్న బాలికకు స్లో పాయిజన్ ఇచ్చి..ఆ రక్తాన్ని ఓ బడాబాబు ఇఛ్చి ఆయన ప్రాణాలు రక్షించేందుకు డాక్టర్లు ప్రయత్నిస్తారు.

అయితే విషయం తెలుసుకున్న చరిత ఆ అమ్మాయిని అక్కడ నుంచి తప్పించి కాపాడే ప్రయత్నం చేస్తుంది. ఓ సారి బ్యాంకాక్ వెళ్ళేందుకు విమానాశ్రయానికి వెళుతున్న సమయంలో జరిగిన గొడవలో రాజ్ (రాజ్ తరుణ్) చేతికి బుల్లెట్ తగులుతుంది. అప్పుడే ఆస్పత్రికి వస్తాడు. అక్కడే చరితను చూసి ప్రేమలో పడతాడు. వీళ్ళ ప్రేమ అంతా కొలిక్కి వచ్చి అంతా సాఫీగా సాగే సమయంలో చరిత అరుదైన గ్రూపు రక్తం ఉన్న బాలికను కాపాడినందుకు ప్రమాదంలో పడుతుంది. ఈ ఘటనలోనే సినిమాలో రాజ్ అన్నగా ఉన్న రాజీవ్ కనకాల హత్యకు గురవుతాడు. ఇక నటీనటుల విషయానికి వస్తే రాజ్ తరుణ్ తనదైన శైలిలో నటించాడు.

కొత్త హీరోయిన్ రిద్దికుమార్ ఓకే అన్పించింది. ఈ సినిమాలో రాజీవ్ కనకాల సీరియస్ పాత్రలో ఆకట్టుకున్నాడు. అయితే కథలో పెద్దగా దమ్ములేకపోవటంతో సినిమా అంతా సో..సోగా సాగుతుంది. అయితే క్లైమాక్స్ లో హై ఎండ్ కార్ డ్రైవింగ్ ను సాంకేతిక సాయంతో హ్యాక్ చేసి...సినిమాను ముగించిన విధానం బాగుంది. ఈ సినిమాలో కొత్తదనం లోపించటంతో రాజ్ తరుణ్ కు ‘లవర్’ మరోసారి నిరాశ మిగిల్చిందనే చెప్పొచ్చు.

రేటింగ్. 2/5

Next Story
Share it