Telugu Gateway
Telangana

కెసీఆర్ వికాస్ పురుష్...మరి తెలంగాణ బిజెపి?

కెసీఆర్ వికాస్  పురుష్...మరి తెలంగాణ బిజెపి?
X

తెలుగుదేశం పార్టీ లోక్ సభలో పెట్టిన అవిశ్వాస తీర్మానం ఎవరికైనా మేలు చేసిందా? అంటే అది ఢిల్లీలో కాంగ్రెస్ కు. తెలంగాణలో సీఎం కెసీఆర్ కు మాత్రమే. రాజకీయంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును టార్గెట్ చేసేందుకు ప్రధాని నరేంద్రమోడీ లోక్ సభ సాక్షిగా చంద్రబాబు గిల్లికజ్జాలు పెట్టుకుంటుంటే..కెసీఆర్ ఇవన్నీ వదిలేసి అభివృద్ధిపై దృష్టి పెట్టి వికాస్ పురుష్ గా మారారనే అర్థం వచ్చేలా వ్యాఖ్యానించారు. సహజంగానే మోడీ వ్యాఖ్యలు తెలంగాణలో టీఆర్ఎస్ ను...ముఖ్యంగా కెసీఆర్ ను అభిమానించే వారికి ఎంతో సంతోషం కలిగించగా...ఏపీలో మాత్రం బిజెపిపై..ముఖ్యంగా మోడీపై కసిని మరింత పెంచాయి. ఇప్పటికే ఉన్న కసికి ఇది మరింత ఆజ్యంపోసింది. తెలంగాణ సీఎం కెసీఆర్ అసలు సచివాలయానికే రారు. మంత్రులు..ఎమ్మెల్యేలకే కాదు..సీనియర్ ఐఏఎస్ లకూ అపాయింట్ మెంట్లు ఇవ్వరనే విమర్శలు ఉన్నాయి. ప్రగతిభవన్ లో అడుగుపెట్టడం సామాన్యుడికి జరిగే పనికాదు. కొద్ది రోజుల క్రితం ప్రజా దర్బారు నిర్వహిస్తామని స్వయంగా సీఎం కార్యాలయం ప్రకటించింది.

తర్వాత ఆ సంగతి మర్చిపోయారు. మంత్రి కెటీఆర్ అయితే ఓ సమావేశంలో అసలు సీఎంను ప్రజలు కలవాల్సిన పనేముంది? అని వ్యాఖ్యానించారు. వారి సమస్యల పరిష్కారానికి గ్రామస్థాయి..మండల, జిల్లా స్థాయి వంటి ఎన్నో అంచెలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఓ వైపు తెలంగాణ బిజెపి మిషన్ భగీరధ, కాళేశ్వరం ప్రాజెక్టుల్లో భారీ ఎత్తున అవినీతి జరుగుతోందని..అసలు తెలంగాణలో పాలన పడకేసిందని తెలంగాణ బిజెపి ఆరోపిస్తోంది. ఈ మధ్యే తెలంగాణ పర్యటనకు వచ్చిన బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఇదేనా టీఆర్ఎస్ అవినీతిపై పోరాటం అంటూ బిజెపి నేతలను ప్రశ్నించారు. బిజెపి జాతీయ నేతలు కూడా టీఆర్ఎస్ సర్కారుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అయితే ప్రదాని మోడీ ఒక్క దెబ్బతో లోక్ సభలో కెసీఆర్ ను పొగిడి తెలంగాణ లో బిజెపి రాజకీయ ప్రయత్నాలకు గండికొట్టినట్లు అయిందనే అభిప్రాయం ఆ పార్టీ నేతల్లో వ్యక్తం అవుతోంది. గత కొంత కాలంగా బిజెపి, టీఆర్ఎస్ ల మధ్య అప్రకటిత స్నేహం సాగుతుందనే విషయం బహిరంగ రహస్యమే. ఎన్నికల ఏడాదిలోకి ప్రవేశించిన తరుణంలో మోడీ చేసిన ప్రకటన తెలంగాణ బిజెపికి షాక్ లాంటిదే.

స్థానిక బిజెపి నేతలు ఎలాంటి విమర్శలు చేసినా..సహజంగానే టీఆర్ఎస్ నేతలు ప్రధాని మోడీ ప్రకటనను ప్రస్తావించటం ఖాయం. ఏపీలో టీడీపీతో స్నేహబంధం పూర్తిగా తెగిపోయినందున కెసీఆర్ ను ప్రశంసించటం ద్వారా మోడీ రెండు లాభాలు ఆశించినట్లు కన్పిస్తోంది. ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ స్నేహహస్తం అందుకోవటం...ఈ ఎన్నికల ముందు చంద్రబాబు ఇమేజ్ ను మరింత తగ్గించటం. మరి ఇవి ఏ మేరకు ఫలితాన్ని ఇస్తాయో వేచిచూడాల్సిందే. తెలంగాణ సీఎం కెసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబులను పోల్చినప్పుడు..ఎందుకు చేస్తున్నారు...వాటి వెనక ఉద్దేశాలను పక్కన పెడితే చంద్రబాబు నిత్యం సమీక్షలు..సమావేశాలతో కాలం గడిపేస్తున్నారు. కెసీఆర్ మాత్రం అందుకు పూర్తి భిన్నం. ఎవరకీ పెద్దగా అందుబాటులో ఉండరు. కనీసం అంబేద్కర్ జయంతి కార్యక్రమాల సమయంలో ఆయన విగ్రహానికి పూల మాల వేయటానికి కూడా కెసీఆర్ బయటకు రారు.

Next Story
Share it