Telugu Gateway
Andhra Pradesh

దివాకర్ రెడ్డి ఓటు ఖరీదు 45.56 కోట్లా?

దివాకర్ రెడ్డి ఓటు ఖరీదు 45.56 కోట్లా?
X

‘లెక్క’ వేసుకోవటానికి తప్ప..దేనికీ పనిరాని టీడీపీ ఎంపీ జెసీ దివాకర్ రెడ్డి ఓటు ఖరీదు 45 కోట్ల రూపాయలా?. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వ నిధులు మంజూరు చేస్తారా?. లేక ఎంపీల బ్లాక్ మెయిల్ ప్రకారం నిధులు కేటాయిస్తారా?. నిజంగా ఇది ప్రజా అవసరం అయితే...సొంత పార్టీ ఎంపీ రెండేళ్ళుగా అడుగుతున్నా ఇంత కాలం అసలు ఈ రోడ్డు విస్తరణకు ఎందుకు నిధులు మంజూరు చేయలేదు. టీడీపీ పెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చలో..ఓటింగ్ లో పాల్గొనను అని...దీని వల్ల ఉపయోగం ఏమీలేదంటూ వ్యాఖ్యలు చేసి జె సీ దివాకర్ రెడ్డి..సడన్ గా చంద్రబాబు ఫోన్ చేయగానే మనసు ఎలా మార్చుకున్నారు. రెండేళ్లుగా జె సీ కోరుతున్నా పట్టించుకోని చంద్రబాబు ఆగమేఘాల మీద రోడ్డు విస్తరణను నిధులు ఎలా మంజూరు చేయించుతారు. జె సీ కోరింది వ్యక్తిగతమైన పనికాకపోయినా ..ఆయన ఓటింగ్ లో పాల్గొనేలా చేసేందుకు సర్కారు ఈ నిర్ణయం తీసుకోవటం.. ఈ విషయం అంతా మీడియాలో రచ్చ రచ్చ కావటం వల్ల ముఖ్యమంత్రి చంద్రబాబు పరువు కూడా పోయిందనే అధికార వర్గాలు సైతం అభిప్రాయపడుతున్నాయి.

అయితే అనంతపురం గురించి తెలిసిన వారి అభిప్రాయం వేరే ఉంది. ప్రతిపాదిత రోడ్డు విస్తరణ తలపెట్టిన ప్రాంతం ఫుల్ బిజీగా, వాణిజ్య సముదాయాలతో కూడి ఉంటుందని..అక్కడ వేలాది మంది ఉపాధి పొందుతున్నారని..విస్తరణ వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ అనే వాదన కూడా టీడీపీ వర్గాల నుంచే విన్పిస్తోంది. కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలో చేరిన జెసీ దివాకర్ రెడ్డికి ఎక్కడలేని ప్రాధాన్యత ఇవ్వటం వల్ల కూడా లేనిపోని సమస్యలు వస్తున్నాయని..సోదరులిద్దరికీ రాజకీయ అవకాశం కల్పించటంతోపాటు..టీడీపీ తన ప్రతిష్టను మసకబార్చుకుంటోందని సీనియర్ నేతలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జె సీ డిమాండ్లు..చంద్రబాబు నిర్ణయాలతో ఈ ప్రభుత్వంలో పనులు అవసరాల ప్రకారం కాకుండా...బెదిరింపుల ప్రకారం జరుగుతాయనే సంకేతం ఇచ్చినట్లు అయిందనే అభిప్రాయం పార్టీ వర్గాల నుంచి విన్పిస్తోంది.

Next Story
Share it