Telugu Gateway
Top Stories

ప్రధాని మోడీకి హ్యాకర్ ఛాలెంజ్!

ప్రధాని మోడీకి హ్యాకర్ ఛాలెంజ్!
X

భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘ఆధార్’ కార్డు భద్రత ఏ మాత్రం సురక్షితం కాదని తేలిపోయింది. ఈ డాటాను హ్యాకర్లు ఎంత సులభంగా తస్కరించవచ్చో చేసి చూపించాడు ఫ్రెంచ్ హ్యాకర్ ఎలియట్ అల్డర్ సన్. వాళ్ళదీ..వీళ్ళదీ కాదు..ఏకంగా దేశంలోని టెలికం నియంత్రణా సంస్థ అయిన ట్రాయ్ ఛైర్మన్ ఆధార్ నెంబర్ ఆధారంగా వివరాలు హ్యాక్ చేసి బహిరంగపర్చాడు. అంతే కాదు...ఏకంగా ప్రధాని మోడీకి ట్విట్టర్ లో ఓ సందేశం పెట్టాడు. మీకు ఆధార్ నెంబర్ ఉంటే..దాన్ని బహిర్గతం చేయండి అని కోరాడు. ట్రాయ్ ఛైర్మన్ ఆర్ ఎస్ శర్మ తన ఆధార్ కార్డు వివరాలను బహిర్గతం చేసి ఓపెన్ ఛాలెంజ్ విసిరాడు.

తమ వివరాలు ఎంత భద్రంగా ఉన్నాయో చూడండి అంటూ శర్మ ట్విట్టర్ లో ఈ వివరాలు పెట్టారు. అయితే ఆయనకు ఎక్కువ సేపు ఆ ఆనందం నిలవలేదు. శర్మ తెలిపిన ఆధార్ నెంబర్ ప్రకారం ఆయన ఫోన్ నెంబర్ తోపాటు పుట్టిన తేదీ, ఇతర వివరాలను కూడా బహిర్గతం చేశాడు హ్యాకర్ . అంతే కాదు..ఏకంగా ఆయన జీమెయిల్ పాస్ వర్డ్ కూడా మార్చగలనని ఛాలెంజ్ విసిరాడు. దీంతో ఆధార్ డేటా ఏ మేరకు సురక్షితంగా ఉందో అర్థం అవుతుంది. ఇది రాబోయే రోజుల్లో పెద్ద వివాదంగా మారటం ఖాయంగా కన్పిస్తోంది. ఏకంగా దేశ ప్రధానికి హ్యాకర్ ఛాలెంజ్ విసరటం సంచలనంగా మారింది.

Next Story
Share it