Telugu Gateway
Andhra Pradesh

కిరణ్ అవినీతిని చంద్రబాబు కాపాడారా?

కిరణ్ అవినీతిని చంద్రబాబు కాపాడారా?
X

ఒకప్పటి కాంగ్రెస్ నేత, ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ మాటలను బట్టి చూస్తుంటే అది నిజమే అని నమ్మాల్సి వస్తోంది. కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా కొనసాగిన డొక్కా మాణిక్యవరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎంగా ఉన్న సమయంలో కిరణ్ కుమార్ రెడ్డి తాను సమైక్యాంధ్ర ఛాంపియన్ గా చెప్పుకుంటూ వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. అంతే కాదు..గవర్నర్ కు తాను ఈ విషయం చెపితే..ఐదు వేల కోట్ల రూపాయలు ఉండదు కానీ..మూడు నుంచిమూడున్నర వేల కోట్ల రూపాయల అవినీతి ఉంటుందని గవర్నర్ కూడా అన్నట్లు మాణిక్యవరప్రసాద్ ఓ ఛానల్ తో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో తాను అప్పుడే ఫిర్యాదులు చేశానని..కావాలంటే బహిర్గతం కూడా చేస్తానని తెలిపారు. సీఎంగా ఉన్న సమయంలో అక్రమంగా సంపాదించిన డబ్బుతో బెంగూళూరులో తన సోదరులతో కలసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి ఇప్పుడు పది వేలకోట్ల రూపాయలు పొగేసుకున్నారని టీడీపీ నేత డొక్కా మాణిక్యవరప్రసాద్ ఆరోపిస్తున్నారు.

2013 సంవత్సరంలో కిరణ్ కుమార్ రెడ్డి సర్కారుపై టీఆర్ఎస్, వైసీపీలు అవిశ్వాస తీర్మానం పెడితే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీనే కిరణ్ కుమార్ రెడ్డి సర్కారును కాపాడింది. ఇది అప్పట్లో టీడీపీలో పెద్ద చర్చకు కూడా దారి తీసింది. డొక్కా మాణిక్యవరప్రసాద్ చెప్పిందే నిజమైతే..చంద్రబాబునాయుడు ఈ అవినీతి కిరణ్ కుమార్ రెడ్డి సర్కారును కాపాడినట్లే కదా?. అంతే కాదు...కిరణ్ తో కలసి వ్యాపారాలు చేసే కిషోర్ కుమార్ రెడ్డి ని ‘నిప్పు’ చంద్రబాబు టీడీపీలో ఎలా చేర్చుకున్నట్లు?. ఆయన అడిగిందే తడవు నామినేటెడ్ పోస్టు ఇవ్వటంతోపాటు..కోరుకున్న పోస్టు ఎందుకిచ్చినట్లు?. కిరణ్ కుమార్ రెడ్డి..ఆయన ఫ్యామిలీపై ప్రస్తుత టీడీపీ నేత, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ప్రజలు అడిగిన వాటికి చంద్రబాబు ఎలాగూ సమాదానం చెప్పరు. పోనీ సొంత పార్టీ నేతలు చేస్తున్న వాటిపై అయినా స్పందిస్తారో లేదో వేచిచూడాల్సిందే. అంత స్థాయిలో అవినీతి చేసిన కిరణ్ సర్కారును చంద్రబాబు అప్పట్లో ఎందుకు కాపాడినట్లు?. ఆయన సోదరుడిని ఎందుకు టీడీపీలో చేర్చుకున్నట్లు?. డొక్కాకు అయినా చంద్రబాబు వివరణ ఇస్తారా?.

Next Story
Share it