Telugu Gateway
Andhra Pradesh

వెంకన్న దర్శనానికి ‘బ్రేక్’

వెంకన్న దర్శనానికి ‘బ్రేక్’
X

కలియుగ దైవమైన వెంకటేశ్వరస్వామి దర్శనానికి ‘బ్రేక్’. టీటీడీ చరిత్రలో ఇలా చేయటం ఇదే మొదటిసారి అని చెబుతున్నారు. ఏకంగా తొమ్మిది రోజుల పాటు భక్తులు స్వామి వారిని దర్శించుకోవటానికి వీల్లేకుండా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు నిర్ణయం తీసుకోవటం చర్చనీయాంశంగా మారింది. అయితే మహా సంప్రోక్షణ జరిగేది ఆగస్టు 12వ తేదీ నుంచి అయితే..ఆగస్టు 9వ తేదీ నుంచే దర్శనాలకు బ్రేక్ ఇవ్వటం కూడా విమర్శలకు తావిస్తోంది. ఆగస్టు 9వ తేదీ సాయంత్రం నుంచి 17 వరకు భక్తులకు స్వామివారి దర్శనాన్ని నిలిపేస్తున్నట్లు టీటీడీ ఛైర్మెన్‌ పుట్టా సుధాకర్‌ యాదవ్‌ నాడు ప్రకటించారు. శనివారం టీటీడీ ఆలయ అధికారులతో అత్యవసర సమావేశం జరిగింది. అనంతరం ఆలయ చైర్మన్‌ మాట్లాడుతూ.. ఆగస్టు 11న అంకురార్పణ ఉంటుందని, 12వ తేదీ నుంచి 16 తేదీ వరకూ శ్రీవారి ఆలయంలో అష్ట బంధన బాలాలయ మహా సం‍ప్రోక్షణ నిర్వహించనున్నట్లు తెలిపారు.

సంప్రోరక్షణ సమయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు ఉంటాయని..ఈ సమయంలో భక్తులకు అవకాశం కల్పించినా 20 నుంచి 30 వేల వరకూ మాత్రమే ఛాన్స్ ఉంటుందని..మిగతా వారంతా క్యూలైన్లలో ఉండి ఇబ్బంది అవుతుంది కాబట్టి భక్తులను అసలు అనుమతించరాదని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తొమ్మిది రోజుల పాటు కొండపైకి భక్తులను అనుమతించేది లేదని పుట్టా సుధాకర్ యాదవ్ స్పష్టం చేశారు. విస్తృత ప్రచారం కల్పించటం ద్వారా ఆ రోజుల్లో భక్తులు రావొద్దని ప్రచారం చేయటం సబబుగా ఉంటుంది కానీ..ఏకంగా తొమ్మిది రోజుల పాటు అసలు భక్తులెవరూ తిరుమలకు రావటానికే వీల్లేదని ప్రకటించటం సరికాదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం రోజుకు కొండమీదకు వచ్చేవారి సంఖ్య లక్షకు చేరినందున ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెబుతున్నారు. అయితే టీటీడీ నిర్ణయంపై భక్తులు ఎలా స్పందిస్తారో వేచిచూడాల్సిందే.

Next Story
Share it