Telugu Gateway
Andhra Pradesh

చంద్రబాబు ఒక్క నెల నిరుద్యోగ భృతి అయినా ఇస్తారా!

చంద్రబాబు ఒక్క నెల నిరుద్యోగ భృతి అయినా ఇస్తారా!
X

అది తెలుగుదేశం పార్టీ ఎన్నికల హామీ. తాము అధికారంలోకి వస్తే యువతకు నెలకు రెండు వేల రూపాయల లెక్కన నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చింది టీడీపీ. కానీ నాలుగేళ్ల పాటు ఈ హామీపై కాలయాపన చేస్తూ వచ్చింది. ఈ మధ్యే అంటే...మే 31న ఏపీ మంత్రివర్గం నిరుద్యోగ భృతికి ఓకే చేసింది. అయితే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ 2000 రూపాయలు కాకుండా..ఈ మొత్తాన్ని 1000 రూపాయలకు తగ్గించారు. త్వరలోనే మార్గదర్శకాలు ఖరారు చేస్తామని..వెంటనే ఇది అమల్లోకి వస్తుందని ప్రకటించారు. తీరా చూస్తే కేబినెట్ నిరుద్యోగ భృతికి ఆమోదించి నెల రోజులు దాటేసింది. ఇంత వరకూ మార్గదర్శకాలు ఖరారు కాలేదు. శుక్రవారం అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో మార్గదర్శకాలకు ఓకే చేసి..వెంటనే అమలు ప్రారంభిస్తారని ప్రచారం జరిగింది. కానీ అదేమీ లేకుండానే మంత్రివర్గ సమావేశం ముగిసింది. చంద్రబాబు సింగపూర్ పర్యటనకు వెళ్ళిపోయారు. అంటే మరోసారి మంత్రివర్గ సమావేశం జరగటానికి కనీసం పదిహేను రోజులు లేదంటే..నెల అయినా పట్టొచ్చు.

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ కు ఇష్టం లేకపోయినా ఏపీలో కూడా అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు రావటం ఖాయం అని తెలుస్తోంది. ఈ లెక్కన ఎన్నికలు డిసెంబర్, జనవరిలోనే ఉండబోతున్నాయి. మరి ఎప్పుడు ఏపీ మంత్రివర్గం నిరుద్యోగ భృతికి సంబంధించిన మార్గదర్శకాలకు ఆమోదం తెలుపుతుంది. అవి ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది. ఈలెక్కన చూస్తుంటే ఎన్నికల్లోపు చంద్రబాబు కనీసం ఒక్క నెల అయినా నిరుద్యోగ భృతి అందించగలరా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సర్కారు తీరు చూస్తుంటే వీలైనంత జాప్యం చేసి..ఏదో మమ అన్పించి హామీని నిలబెట్టుకున్నామని ప్రచారం చేసుకునే ఆలోచన తప్ప..నిజంగా నిరుద్యోగులకు మేలు చేయాలనే ఆలోచన ఉన్నట్లు కన్పించటం లేదనే విమర్శలు ప్రభుత్వ వర్గాల నుంచే విన్పిస్తున్నాయి.

Next Story
Share it