Telugu Gateway
Andhra Pradesh

ఏపీ ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో గెలిచేది ఇద్దరే!

ఏపీ ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో గెలిచేది ఇద్దరే!
X

ఆంధ్రప్రదేశ్ లో అధికార తెలుగుదేశం పార్టీకి ఇది చేదు వార్తే. ఫిరాయింపుదారుల్లో గెలుపు అవకాశాలు కేవలం ఇద్దరికి మాత్రమే ఉన్నాయని ఓ సర్వే తేల్చింది. ముఖ్యంగా ఫిరాయింపు నియోజకవర్గాల్లో పరిస్థితిని ఓ సంస్థ మదింపు చేసింది. ఇందులో తేలిన ఫలితాల ప్రకారం కేవలం ఇద్దరు మాత్రమే బయటపడే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. గెలుపు చాన్స్ ఉన్న వారిలో ఇద్దరు కూడా మంత్రులే. అందులో ఒకరు విజయనగరం జిల్లాలోని బొబ్బిలి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సుజయ కృష్ణరంగారావు ఒకరు. మరొక మంత్రి చిత్తూరు జిల్లాలోని పలమనేరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అమరనాధ్ రెడ్డి ఉన్నారు. వైసీపీ టిక్కెట్ పై గెలిచి ప్రస్తుతం మంత్రివర్గంలో కొనసాగుతున్న మంత్రి ఆదినారాయణరెడ్డి, భూమి అఖిలప్రియకు కూడా గెలుపు అంత సులభం కాదని సర్వే నిగ్గుతేల్చింది. ప్రధాన ప్రతిపక్షం అయిన వైసీపీ నుంచి ఏకంగా 22 మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడి టీడీపీలోకి జంప్ అయిన విషయం తెలిసిందే. వీరికే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు లభిస్తే అన్న ప్రాతిపదికపైనే ఈ సర్వే నిర్వహించారు.

వైసీపీని రాజకీయంగా దెబ్బతీయటానికి చంద్రబాబు భారీ ఎత్తున ఎమ్మెల్యేలను అయితే చేర్చుకున్నారు కానీ...వచ్చే ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు, పార్టీలోని తిరుగుబాట్లను నియంత్రించటం అంత సులభం కాదని చెబుతున్నారు. అందుకే ఎక్కువగా ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఇంటిబాటే పట్టే అవకాశం ఉందని తేలుతోంది. తెలుగుదేశం నేతల్లో కూడా చాలా చోట్ల ఈ విషయంపై అసంతృప్తి నెలకొని ఉంది. ఓ వైపు గత కొంత కాలంగా మాజీ ఎమ్మెల్యేలు పలువురు వైసీపీలో చేరుతున్నారు. గతంలో ఎన్నడూలేనీ రీతిలో ఏపీలో అవినీతి విశృంఖల స్థితికి చేరుకోవటంతోపాటు..ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నూతన రాజధాని అమరావతిపై ఎన్నో ఆశలు చూపించి..ప్రజలను నిరుత్సాహపర్చిన విషయం తెలిసిందే. దీనికి తోడు పలు అంశాలు ప్రభుత్వంపై వ్యతిరేకతను తీవ్రంగా పెంచాయి. ఇవన్నీ కూడా ఆయా నియోజకవర్గాల్లో అధికార పార్టీకి ఎదురుగాలి వీయటానికి ప్రధాన కారణాలుగా ఉన్నాయి.

Next Story
Share it