Telugu Gateway
Andhra Pradesh

ఉప ఎన్నికలపై ‘జగన్ ట్విస్ట్’

ఉప ఎన్నికలపై ‘జగన్  ట్విస్ట్’
X

ఏపీ రాజకీయం హాట్ హాట్ గా సాగుతోంది. వైసీపీ ఎంపీల రాజీనామాలు డ్రామాలు..ఎన్నికలు రావని తెలిసే ఈ డ్రామా ఆడుతున్నారంటూ గత రెండు రోజులుగా టీడీపీ వరస పెట్టి విమర్శలు చేస్తోంది. బుధవారం వైసీపీ ఎంపీలు ఢిల్లీలో స్పీకర్ సుమిత్రా మహాజన్ తో సమావేశం అయి మరోసారి రాజీనామా లేఖలు అందించటంతో ‘ఆమోద’ ప్రకటన రావటమే ఇక ఆలశ్యం. తమ ఎంపీలకు ఇంకా పధ్నాలుగు నెలల పదవీ కాలం ఉందని...ఉప ఎన్నికలు ఖచ్చితంగా వస్తాయని జగనన్ తెలిపారు. మరి టీడీపీ పోటీచేస్తే అని విలేకరులు ప్రశ్నించగా...‘మేం ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్నాం. మా ఎంపీలు దీని కోసం పోరాటం చేశారు. అంటే చంద్రబాబు ప్రత్యేక హోదాను వ్యతిరేకిస్తారా?. రాజీనామాల విషయంలో కలసి రావాల్సింది పోయి...హోదా కోసం పోరాడే వాళ్లకు అడ్డం వస్తారా?. టీడీపీ బరిలో నిలిస్తే మంచిదే. వాళ్ళకు డిపాజిట్లు కూడా రావు’ అని జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో రాజకీయం కొత్త మలుపు తిరగబోతోంది. పధ్నాలుగు నెలల పదవీ కాలాన్ని వదులుకున్న తమ ఎంపీలకు సెల్యూట్ అని జగన్ వ్యాఖ్యానించారు.

రాష్ట్రానికి చెందిన 25 మంది ఎంపీలు రాజీనామాలు చేసివుంటే కేంద్రంపై ఆ ప్రభావం తీవ్రంగా ఉండేదని పేర్కొన్నారు. ఎంపీలతో రాజీనామాలు చేయించేందుకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు భయపడ్డారని ఆరోపించారు. ఉప ఎన్నికలు వస్తే ధైర్యంగా ఎదుర్కొంటామని వెల్లడించారు. ఉప ఎన్నికలు కచ్చితంగా వస్తాయా? అని ప్రశ్నించిన ఓ జర్నలిస్టును ఉద్దేశించి సార్వత్రిక ఎన్నికలకు ఇంకా 14 నెలల సమయం ఉందని వైఎస్‌ జగన్‌ చెప్పారు. ప్రత్యేక హోదా విషయంలో తప్పు చేశానని సీఎం చంద్రబాబుకు తెలుసని, అందుకే ఆయన మంచి చేస్తున్నవారిపై బురదజల్లేందుకు యత్నిస్తున్నారని అన్నారు. ప్రతి పార్లమెంటు సమావేశాల సమయంలో పార్టీ ఫిరాయించిన ఎంపీలపై వేటు వేయాలని స్పీకర్‌ను కోరుతూనే ఉన్నామని ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ గుర్తు చేశారు. అయినా వారిపై వేటు పడకుండా చంద్రబాబు మేనేజ్‌ చేస్తున్నారని ఆరోపించారు.

Next Story
Share it