Telugu Gateway
Telangana

బిజినెస్ రూల్స్ కు తూట్లు పొడిచిన తెలంగాణ సీఎస్!

బిజినెస్ రూల్స్ కు తూట్లు పొడిచిన తెలంగాణ సీఎస్!
X

తెలంగాణలో ఐఏఎస్ లు ఇప్పుడు రగిలిపోతున్నారు. సీఎస్ పై కూడా మండిపడుతున్నారు. ఎవరైనా తప్పు చేస్తే సరిదిద్దాల్సిన సీఎస్ ఏకంగా తానే బిజినెస్ రూల్స్ కు వ్యతిరేకంగా ఉత్తర్వులు జారీ చేయటంపై ఐఏఎస్ ల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సహజంగా సీఎస్ అంటే రాష్ట్ర పరిపాలనకు మార్గదర్శకుడు. అందరికీ ఆయనే ఓ దారి చూపాలి. ఏదైనా సంక్లిష్ట సమస్య వస్తే పరిష్కరించాల్సింది ఆయనే. కానీ ఆయనే ఏకంగా నిబంధనలకు విరుద్ధంగా...బిజినెస్ రూల్స్ ను పక్కన పెట్టి..వేరే శాఖలో వేలు పెట్టి ఆదేశాలు జారీ చేస్తే?. ఇక ఏ అధికారి అయినా ఎవరికి చెప్పుకోవాలి?. అదీ సంబంధిత శాఖకు సంబంధించిన ఉన్నతాధికారి..సాక్ష్యాత్తూ స్పెషల్ సీఎస్ క్యాడర్ లో ఉన్న అధికారి ఫైలులో లేవనెత్తిన అభ్యంతరాలను పక్కన పెట్టి మరీ వేరే శాఖలో జొరబడి ఉత్తర్వులు జారీ చేయటంలో ఔచిత్యం ఏమిటి?. ఏ మాత్రం వివాదాల జోలికిపోకుండా..కామ్ గా తన పని తాను చేసుకుపోయే తెలంగాణ సీఎస్ శైలేంద్రకుమార్ జోషి ఎందుకు ఈ వివాదం చిక్కుకున్నారు. ఏకంగా సీఎస్ కు కూడా ప్రభుత్వంలో ‘స్వేచ్చ’ లేదా?.

ఏ ఉన్నతాధికారి అయినా..ఏకంగా సీఎస్ తీసుకున్న నిర్ణయాన్ని అయినా మంత్రివర్గంలో పెట్టి తిరస్కరించవచ్చు. ప్రభుత్వం సొంతంగా నిర్ణయం తీసుకోవచ్చు. కానీ సంబంధిత శాఖ అధికారి లేవనెత్తిన అభ్యంతరాలను పక్కన పెట్టి..రంజీవ్ ఆర్ ఆచార్య శాఖకు సంబంధించిన జీవో ఏకంగా సీఎస్ జారీ చేయటం ప్రభుత్వంలో ఇప్పుడు కలకలం రేపుతోంది. ఇది బిజినెస్ రూల్స్ కు వ్యతిరేకం అని..సీఎస్ అలా చేయటం వెనక ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న ఓ మంత్రి విపరీత ఒత్తిడి ఉందని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎంత ఒత్తిడి ఉన్నా కూడా సీఎస్ ఇలా చేసి ఉండాల్సి కాదని ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. పలు కాలేజీలకు గేమింగ్ కోర్సుల నిర్వహణకు అనుమతిస్తూ జారీచేసిన ఉత్తర్వులు ప్రభుత్వంలో పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే. జీఏడీ మినహా ఇతర ఉత్తర్వులు ఎప్పుడూ సీఎస్ లు జారీ చేయరు. నాలుగైదు శాఖల మధ్య సమన్వయం చేయాల్సిన అంశాలు ఉన్నప్పుడు కూడా సీఎస్ జీవోలు జారీ చేయవచ్చని ఉన్నతాధికారులు చెబుతున్నారు.

Next Story
Share it