Telugu Gateway
Telangana

టీఆర్ఎస్ కు మరో షాక్

టీఆర్ఎస్ కు  మరో షాక్
X

హైకోర్టులో అధికార టీఆర్ఎస్ పార్టీకి చుక్కెదురైంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేల సభ్యత్వ రద్దు పై గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు ను సవాలు చేస్తూ 12 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డివిజన్ బెంచ్ లో వేసిన అప్పీల్ పిటిషన్ హై కోర్ట్ కొట్టివేసింది. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి, సంపత్ లకు ఊరట దక్కినట్లు అయింది. ఎమ్మెల్యేలకు ఈ పిటీషన్ వేసే అర్హతలేదని హైకోర్టు స్పష్టం చేసింది. కాంగ్రెస్ పార్టీ లాయర్ కూడా ఇదే వాదన లేవనెత్తారు. సింగల్ బెంచ్ తీర్పును ద్విసభ్య బెంచ్ కూడా సమర్థించింది. దీంతో ఎలాగైనా కోమటిరెడ్డి, సంపత్ లను అసెంబ్లీలోకి అడుగుపెట్టకుండా చేయాలనే అధికార పార్టీ ప్రయత్నాలు ఫలించలేదు. బడ్జెట్ సమావేశాల ప్రారంభమైన రోజు జరిగిన గొడవను ఆసరా చేసుకుని ఏకంగా అధికార పార్టీ సభలో తీర్మానం పెట్టి ఇద్దరు కాంగ్రెస్ సభ్యుల సభ్యత్వాన్ని రద్దు చేస్తూ తీర్మానాన్ని ఆమోదించిన విషయం తెలిసిందే.

కనీసం వారికి నోటీసులు ఇవ్వకుండా...కమిటీ ఏర్పాటు చేయకుండా ఏకపక్షంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో సర్కారుకు చుక్కెదురు అవుతూనే ఉంది. సింగిల్ బెంచ్ ఆదేశాల తర్వాత తమకు గన్ మెన్ల రక్షణ కల్పించాలని కోరినా..ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. ఇప్పుడు తాజాగా డివిజన్ బెంచ్ కూడా అదే రిపీట్ కావటంతో సర్కారు ఎలా ముందుకెళుతుందో వేచిచూడాల్సిందే.

Next Story
Share it