Telugu Gateway
Telangana

రైతు బంధు నిధులతో ‘విదేశాల్లో ఎంజాయ్’!

రైతు బంధు నిధులతో ‘విదేశాల్లో ఎంజాయ్’!
X

కష్టాల్లో ఉన్న రైతాంగాన్ని ప్రభుత్వాలు ఆదుకోవాల్సిందే. ఆదుకోవటం అంటే ముఖ్యంగా ‘గిట్టుబాటు ధర’ కల్పించటం వంటి వాటికి ఉపక్రమిస్తే రైతులకు మరింత ప్రయోజనం. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ అధికారుల సూచనలను పక్కన పెట్టి మరీ ‘పరిమితి’ లేకుండా రైతుబంధు పేర సాయం చేస్తుండటంతో ఈ నిధులు అన్నీ పక్క దారి పట్టేస్తున్నాయి. ఈ పథకం కింద పేద రైతులకు అందుతున్న సాయం నామమాత్రంగా ఉంటే..బడాబాబులకు మాత్రం లక్షలకు లక్షల్లో డబ్బులు వస్తున్నాయి. సహజంగా ఫ్రీగా వచ్చిన డబ్బులు కదా అన్న ఉద్దేశంతో కొంత మంది సంపన్నులు ఈ నిధులతో విదేశాలకు వెళ్లి మరీ ఫ్యామిలీలతో ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్లను తప్పుపట్టడానికి కూడా లేదు. ఎందుకంటే ఈ మొత్తాలు వాళ్లు అడిగితే ఇచ్చినవి కావు కనుక. ప్రభుత్వమే ఎవరికి సాయం అవసరమో గుర్తించి వారికి మాత్రమే చేయాలి కానీ..మా ఇష్టప్రకారం చేస్తాం అంటే..ఇలాగే ఉంటుంది పరిస్థితి. రైతు బంధు సాయం నిధులతో విదేశీ యాత్రలు చేసి వచ్చిన వారెందరో. మరికొంత మంది ఇక్కడే స్నేహితులతో కలసి గ్రాండ్ గా దావత్ లు చేసుకున్నారు ఇవే నిధులతో.

ఏ మాత్రం వ్యవసాయం చేయకుండా..రైతు బంధు పథకం కింద నిధులు పొందిన వారిలో మెజారిటీ వ్యక్తులు ఆ నిధులను పార్టీలు చేసుకునేందుకు..జల్సాలు చేసేందుకు వాడుకున్నారు. భారీ ఎత్తున సాయం పొందిన రైతులు ఎవరైనా డబ్బువెనక్కి ఇస్తున్నారా? అని ప్రశ్నిస్తే ‘మేమెందుకు ఇస్తాం. మాకు నచ్చినట్లు వాడుకుంటాం’ అంటూ సమాధానం ఇచ్చారు ఆ బడాబాబులు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బంధు నిధులు అర్హుల కంటే అవసరం లేని వారికే భారీ మొత్తంలో చేరాయనే విమర్శలు విన్పిస్తున్నాయి. అసలు ఏ మాత్రం అవసరం లేని వారికి ప్రభుత్వం సంక్షేమ పథకాల పేరుతో కోట్ల రూపాయలు పందేరం చేయటం రాజ్యాంగ ఉల్లంఘనే అని ఉన్నతాధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. వచ్చే దఫా రైతు బంధు పథకంలో అయినా ‘సీలింగ్’ పెట్టి చిన్న రైతులకు మాత్రమే పథకం వర్తింప చేస్తే అర్హులకు మాత్రమే సాయం చేసినట్లు అవుతుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. లేదంటే ప్రజలు పన్నుల రూపంలో కట్టిన డబ్బును కొంత మంది బడాబాబుల జల్సాలకు కేటాయించినట్లు అవుతుంది.

Next Story
Share it