Telugu Gateway
Politics

పగ వదలి...ఫ్రెండ్ షిప్ దిశగా

పగ వదలి...ఫ్రెండ్ షిప్ దిశగా
X

ట్రంప్ అంటే కిమ్ కు పడదు. కిమ్ అంటే ట్రంప్ కు పడదు. ఇద్దరూ తుంటరి నేతలే. గత అధ్యక్షుల తరహాలో కాకుండా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చర్యలు వినూత్నంగా ఉంటున్నాయి. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ కూడా అంతే మొండివాడు. గత కొంత కాలంగా అమెరికా, దక్షిణ కొరియా అధ్యక్షుల మధ్య సవాళ్ళు..ప్రతిసవాళ్లు సాగాయి. లేపేస్తామంటే..లేపేస్తాం అనే తరహాలో వీరిద్దరి వ్యాఖ్యలు చూసి ప్రపంచ దేశాలు కూడా ఆశ్చర్యపోయాయి. అలాంటి ఉద్రిక్త పరిస్థితుల నుంచి..పాత పగకు స్వస్తి చెప్పి..ఇద్దరూ ఫ్రెండ్ షిప్ చేసేందుకు రెడీ అయిపోయారు. అందులో కీలక ఘట్టమే సింగపూర్ లో మంగళవారం నాడు జరిగిన చర్చలు. కొరియా యుద్ధం జరిగిన 1950-53 తర్వాత అమెరికా, ఉత్తర కొరియా దేశాలు ఆగర్భ శత్రువులుగా మారిపోయాయి. ఇప్పటి వరకూ ఈ రెండు దేశాల అధ్యక్షుల భేటీలు కూడా జరగలేదు. అలాంటిది ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ లు సింగపూర్ లోని కేపెల్లా హోటల్ లో ముఖాముఖి భేటీ అయి ఫోటోలకు ఫోజులు ఇవ్వటంతో పాటు..ఇద్దరూ తమ చర్చలు అత్యంత అర్థవంతంగా..సాఫీగా సాగాయని ప్రకటించటం సానుకూల పరిణామంగా భావిస్తున్నారు.

ఉత్తర కొరియా గత కొంత కాలంగా పలు అణుపరీక్షలు జరిపి అగ్రరాజ్యం అమెరికా ఆగ్రహానికి గురైంది. అయినా సరే..కిమ్ తన పని తాను చేసుకుంటూ పోయారు. కానీ భారీ కసరత్తు తర్వాత కొరియా ద్వీపకల్పంలో అణునిరాయుధీకరణ, శాంతిస్థాపన లక్ష్యాలుగా తాజా సమావేశం జరిగింది. తమ భేటీ చాలా బాగా జరిగిందని..అనుకున్న దానికంటే ఇది మరింత మెరుగ్గా ఉందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించటం విశేషం. తమ భేటీతో ప్రపంచం త్వరలోనే గొప్ప మార్పును చూడబోతుందని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ సైతం వ్యాఖ్యానించారు. ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఈ సమావేశం సాఫీగా సాగటమే కాదు..ఇద్దరు అధ్యక్షులు పలు కీలక ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. వీటి ఫలితాలు త్వరలోనే ఉంటాయనే సంకేతాలు పంపారు ఇద్దరు అధ్యక్షులు. అత్యంత కీలకమైన ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు గాను ట్రంప్ కు కిమ్ అభినందనలు తెలిపారు. అదే సమయంలో ట్రంప్ కూడా కిమ్ ను వైట్ హౌస్ కు ఆహ్వానించారు.

Next Story
Share it