Telugu Gateway
Andhra Pradesh

పవన్..లోకేష్ ‘ఒకటే ఫార్ములా’!

పవన్..లోకేష్ ‘ఒకటే ఫార్ములా’!
X

ఒకరు పార్టీ అధినేత. మరొకరు రాష్ట్ర మంత్రి..భవిష్యత్ నేతగా చలామణిలో ఉన్నవారు. ఇద్దరూ ఒకటే ఫార్ములా ఫాలో అవుతున్నారు. ఇద్దరూ మీడియా ముందుకొచ్చి మాట్లాడటానికి పెద్దగా ఇష్టపడరు. ఎందుకంటే ప్రశ్నలు..సమాధానాలు..చికాకులు. ఎక్కడ ఎలా దొరికిపోతామో అన్న భయం. లోకేష్ అయితే పబ్లిక్ మీటింగ్ ల్లోనూ దొరికిపోతుంటారు. అందుకే అటు పవన్..ఇటు లోకేష్ లు ఇద్దరూ ప్రత్యర్ధులపై విమర్శలకు ‘ట్విట్టర్’నే నమ్ముకున్నారు. తెలుగుదేశం పార్టీకి విషయానికి వస్తే కొంత మంది నేతలు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దగ్గర నుంచి మొదలుపెట్టి స్థానిక నాయకులపై అయినా అలవోకగా విమర్శలు చేసేస్తుంటారు. అది వారి స్కిల్. కానీ ఎంత పెద్ద విషయం ఉన్నా..ప్రత్యర్ధులపై విమర్శలు చేయేటానికి..అవకాశాలను అందిపుచ్చుకోవటానికి నారా లోకేష్ మీడియా ముందుకు రారు. ఎప్పుడైనా పొరపాటున వచ్చినా తాను చెప్పాల్సింది చెప్పేసి ఎంచక్కా వెళ్లిపోతారు. ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీరు కూడా అచ్చం అలాగే ఉంది. కొద్ది రోజుల క్రితం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తెలుగు రాష్ట్రాలను కుదిపేసింది.

ఆ సమయంలో కనీసం ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడని పవన్ కళ్యాణ్ తాపీగా ట్విట్టర్ లో కామెంట్లు పెట్టారు. ఏ విషయంలో అయినా అంతా అయిపోయాక స్పందించటం పవన్ కళ్యాణ్ అలవాటుగా మారిపోయింది. టీటీడీ వివాదం చాలా వరకూ సద్దుమణిగిపోయింది. సడన్ గా పవన్ వచ్చి...విషయం నిగ్గుతేలాల్సిందే..సీబీఐ విచారణ జరపాల్సిందే అంటూ ట్విట్టర్ వేదికగా ప్రకటన చేయటం విశేషం. ఏ ఒక్క అంశంపై అయినా నిర్దిష్టంగా మీడియాను ఎదుర్కోవటానికి ఇబ్బందిపడే వారు రాష్ట్రాన్ని ఎలా పరిపాలిస్తారు?. ఏదైనా అంశం పై మాట్లాడటానికి ముందు అటు లోకేష్, ఇటు పవన్ లు ముందస్తు కసరత్తు ఏ మాత్రం చేయరని..అందుకే ఇలాంటి సమస్యలు వస్తున్నాయని ఓ సీనియర్ నేత విశ్లేషించారు. ఓ గంట పాటు కసరత్తు చేస్తే చెప్పాల్సిన విషయాన్ని స్పష్టంగా చెప్పి బయటపడొచ్చని..కానీ ఈ నేతలిద్దరూ ‘ట్విట్టర్ ’నే నమ్ముకున్నారని చెబుతున్నారు.

Next Story
Share it