Telugu Gateway
Telangana

తెలంగాణ ఉద్యోగులకు కెసీఆర్ షాక్!

తెలంగాణ ఉద్యోగులకు కెసీఆర్ షాక్!
X

తెలంగాణ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కెసీఆర్ రాష్ట్ర నాల్గవ వార్షికోత్సవ సమయంలో భారీ షాక్ ఇఛ్చారు. మధ్యంతర భృతి(ఐఆర్)కు సంబంధించిన అంశంపై ఊరించి ఉస్సురుమన్చించారు. దీనికి సంబంధించి ప్రభుత్వం తెరపైకి తెచ్చిన వాదన చూసి ఉద్యోగులు నవ్వుతున్నారు. కేవలం ఐఆర్ ను స్కిప్ చేసేందుకే సర్కారు ఈ ప్లాన్ వేసిందని ఉద్యోగ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. ఆర్థిక క్రమశిక్షణలో లోపం, ప్రాజెక్టుల్లో అక్రమాల వంటి అంశాల్లోనే కాగ్ లేవనెత్తిన అభ్యంతరాలను లైట్ తీసుకున్న సర్కారు...ఉద్యోగులకు ఇవ్వాల్సిన మధ్యంత భృతి ఇస్తే కాగ్ అభ్యంతరాలు చెబుతుందనే వాదనను తెరపైకి తీసుకొచ్చారు. అసలు కాగ్ కు...ఉద్యోగుల ఐఆర్ కు ఏ మాత్రం సంబంధం లేదు. ఈ విషయం ప్రతి ఒక్కరికీ తెలుసు. కానీ ప్రభుత్వ ఉన్నతాధికారులకు ఈ విషయం తెలియదా?. ఉద్యోగులు అంత తేలిగ్గా పత్రికల్లో ఇదే అంశంతో ప్రచారం చేస్తే నమ్మేస్తారా?.

పీఆర్ సీ నివేదిక ఇఛ్చాక ఇక అసలు ఐఆర్ ప్రస్తావన ఎక్కడ ఉంటుంది. నివేదికలోని సిఫారసులను ఎంత మేరకు ప్రభుత్వం ఆమోదించాలనుకుంటుందో అంత వరకు ఆమోదించి..ఆ మొత్తాలను ఏయే రూపాల్లో ఇవ్వాలో నిర్ణయం తీసుకుంటారు. అంతే కానీ..నివేదిక ఇచ్చాక ఇక ఐఆర్ అన్న ప్రస్తావనే ఉండదు. అయితే మొదట 25 శాతం ఐఆర్ ఇస్తామని ప్రచారంలో పెట్టి..ఆకస్మాత్తుగా వెనక్కి తగ్గటానికి ప్రధాన కారణం రాష్ట్ర ఆర్థిక పరిస్థితే అని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. పైకి అంతా ఓకే అని చెబుతున్నా...ఆర్థిక నిర్వహణ ఏ మాత్రం సరిగాలేదని..పలు శాఖల్లో ఇఫ్పటికే చెల్లించాల్సిన బిల్లులు వేల కోట్లలో పెండింగ్ లో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. అందుకే ఉద్యోగులకు ఐఆర్ ఇవ్వకుండా వాయిదా వేసేందుకే కాగ్... పే రివిజన్ కమిషన్ ను అవమానించినట్లు అవుతుందనే కొత్త వాదనలు తెరపైకి తెచ్చి ఉద్యోగులకు సర్కారు షాక్ ఇచ్చిందని చెబుతున్నారు. దీనిపై ఉద్యోగ సంఘాలు ఎలా స్పందిస్తాయో వేచిచూడాల్సిందే.

Next Story
Share it