Telugu Gateway
Telangana

కెసీఆర్ రైతుబంధు ‘రాజ్యాంగ ఉల్లంఘనే’!

కెసీఆర్ రైతుబంధు ‘రాజ్యాంగ ఉల్లంఘనే’!
X

రైతులకు మేలు చేస్తుంటే..రాజ్యాంగ ఉల్లంఘన ఏంటి అంటారా?. నిజమే..కానీ రైతు బంధు ఖచ్చితంగా రాజ్యాంగ ఉల్లంఘనే అని చెబుతున్నాయి అధికార వర్గాలు. రాజ్యాంగంలో చెప్పినట్లు అది కేంద్రం అయినా...రాష్ట్రం అయినా ‘సంక్షేమ రాజ్యం’లో అర్హులకు మాత్రమే సాయం చేయాలి. అదీ ఎందుకంటే సమాజంలో అసమానతలను రూపుమాపటానికి..ప్రజల మధ్య సమానత్వం సాధించటానికి. ఏ ప్రభుత్వం అయినా సంక్షేమ పథకాలు కేవలం దారిద్ర్య రేఖ దిగువన (బీపీఎల్) ఉన్న కుటుంబాలకు మాత్రమే ఎందుకు అందిస్తారు. అంటే వాళ్లు కూడా అందరితో సమానంగా మూడు పూటలా తిండి తినే వెసులుబాటు కల్పించటం కోసం. అందుకే సంక్షేమ పథకాలు అన్నీ ఆర్థికంగా వెనకబడిన వర్గాల వారికే మాత్రమే అందిస్తారు. మరి తెలంగాణ సర్కారు అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘రైతు బంధు’ దగ్గరకు వచ్చేసరికి ఈ సూత్రాన్ని ఎందుకు విస్మరించారు. ప్రభుత్వం ఇఛ్చేది ప్రజలు పన్నుల రూపంలో చెల్లించిన డబ్బులే. రైతులు కష్టాల్లో ఉన్నమాట కూడా వాస్తవమే. అయితే ఎలాంటి రైతులకు సాయం చేయాలి?.

ఎకరం నుంచి ఐదు ఎకరాలు ఉన్న వారికి సాయం చేస్తారా?. లేక కుటుంబంలో అందరికీ కలిపి వందల ఎకరాలు ఉన్నా కూడా ‘రైతు బంధు’ కింద లక్షలకు లక్షల ప్రజాధనాన్ని పంచిపెడతారా?. ఈ తరహా పథకాలు ఏ మాత్రం సమర్థనీయం కాదని..రాజ్యాంగంలో పేర్కొన్న సంక్షేమ రాజ్యం స్పూర్తికి ఈ పథకం విఘాతం కలిగిస్తోందని ప్రభుత్వ అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. పొలం ఉంటే చాలు..అది ఫార్మ్ హౌస్ అయినా..సాగుకు పనికి రాని భూమి అయినా...భారీ కమతాలు ఉన్నా..అందరికీ రైతు బంధు కింద సాయం చేయటం అంటే...రాజ్యాంగ ఉల్లంఘన కిందే వస్తుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ పథక రూపకల్పన దశలోనే కొంత మంది ఉన్నతాధికారులు ‘పరిమితులు’ పెట్టడం ఉత్తమం అని..కొన్ని సూచనలు కూడా చేసినట్లు అధికారులు తెలిపారు.

ఇవేమీ పట్టించుకోని కెసీఆర్ పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్న రైతులందరికీ ఈ పథకం వర్తింప చేయాల్సిందేనని తేల్చిచెప్పటంతో అధికారులు కూడా మౌనం దాల్చాల్సి వచ్చింది. అధికారంలో ఉన్నాం కాబట్టి ప్రజల సొమ్ముతో మా ఇష్టం వచ్చినట్లు చేస్తామనటం సరికాదని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. కేవలం ఎన్నికల ఏడాదిలో రాజకీయ కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనపడుతోందనే అభిప్రాయం ప్రభుత్వ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. ఇప్పటికే రైతు బంధు అంశంపై హైకోర్టులో పిటీషన్ కూడా దాఖలు అయింది. మరి కోర్టు దీనిపై ఎలా స్పందిస్తుందో వేచిచూడాల్సిందే. ఇలా రైతు బంధు పధకం పేరుతో వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని పంచి పెట్టడం కాకుండా..పంట పండిన తర్వాత ‘మద్దతు ధర’ విషయంలో సాయం చేసి ఉంటే అసలైన రైతులకు మేలు జరిగేదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

Next Story
Share it