Telugu Gateway
Andhra Pradesh

‘పశ్చిమ గోదావరి’ జిల్లాలో చంద్రబాబుకు ప్రమాద ఘంటికలు

‘పశ్చిమ గోదావరి’ జిల్లాలో చంద్రబాబుకు ప్రమాద ఘంటికలు
X

గోదావరి జిల్లాల్లో ఎవరికి ఎక్కువ సీట్లు వస్తే వారిదే అధికారం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అదే ట్రెండ్. ఇప్పుడూ అదే కొనసాగుతుంది. గత ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీ పశ్చిమ గోదావరి జిల్లాలోని 15 సీట్లలో పదిహేను సీట్లు దక్కించుకుంది. అప్పటి మిత్రపక్షం బిజెపితో కలుపుకుని. కానీ ఈ సారి మాత్రం సీన్ రివర్స్ అయ్యేట్లు కనపడుతోంది. ఈ సారి 15 సీట్లు ఉన్న పశ్చిమ గోదావరి జిల్లాలో అధికార టీడీపీ నాలుగు నుంచి ఐదు సీట్లు గెలుచుకొంటే గొప్పేనని టీడీపీ నేతలే చెబుతున్నారు. దీనికి బలమైన కారణాలు ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా ప్రధానంగా వ్యవసాయాధార ప్రాంతం. గత ఎన్నికల సమయంలో రైతు రుణ మాఫీ హామీ ఇచ్చిన చంద్రబాబు ఈ హామీని పూర్తిగా అమలు చేయటంలో విఫలమయ్యారు. ఎంత రుణం ఉంటే అంత రుణం మాఫీ చేస్తామని హామీ ఇఛ్చి..అధికారంలోకి వచ్చిన తర్వాత అడ్డగోలుగా కోతలు వేయటంతో జిల్లాలోని రైతాంగం తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. ఎన్నికలకు ముందు రుణమాఫీ పేరు చెప్పి అవసరం లేని వారితో కూడా కొన్ని చోట్ల టీడీపీ నేతలు రుణాలు తీసుకునేలా చేశారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీరు చేసిన చర్యలతో రైతాంగం తీవ్ర అసంతృప్తితో రగిలిపోతోంది. పైకి అంతా ప్రశాంతంగా ఉన్నా..ఎన్నికల సమయంలో వారు తమ కసి తీర్చుకోవటం ఖాయం అనే సంకేతాలు వెలువడుతున్నాయి. దీనికి తోడు డ్వాక్రా రుణాల మాఫీ విషయంలోనూ అదే తీరు.

ఓ వైపు హామీల అమలు విషయంలో మోసం ఒకెత్తు అయితే...స్థానిక నాయకుల దందాలు..అరాచకాలు టీడీపీకి తీరని నష్టం చేయటం ఖాయం అని చెబుతున్నారు. దీనికి తోడు నిడదవోలు, కొవ్వూరు, ఆచంట, పోలవరం నియోజకవర్గాల్లో సాగుతున్న అడ్డగోలు ఇసుక దోపిడీ టీడీపీపై వ్యతిరేకతను పీక్ కు చేర్చింది. గతంలో అధికారంలో ఉన్న టీడీపీ నేతలు, మంత్రులు అయినా రాష్ట్ర స్థాయిలో ఏదైనా పనులు చేసి సంపాదించుకునే వారని..ఇంతలా జిల్లా, నియోజకవర్గాల్లో దోపిడీ ఎన్నడూలేదని చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న గెలుపు గ్యారంటీ జాబితాలో ఉండి, గోపాలపురం, దెందులూరు, తణుకు నియోజకవర్గాలు ఉన్నాయి. ఇద్దరు మంత్రులు పితాని, జవహర్ కూడా ఎదురుగాలి తప్పదని..ఓ సర్వేలో తేలింది. ప్రస్తుత మంత్రులతోపాటు మాజీ మంత్రులు ఓటమి గండం తప్పేలాలేదనే సంకేతాలు వెలువడుతున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాకతో కూడా ఉభయ గోదావరి జిల్లాల్లో రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. నాలుగేళ్ల పాటు వదిలేసి...ఇఫ్పుడు కొత్తగా చంద్రబాబు అందుకున్న ‘ప్రత్యేక హోదా’ నినాదం పశ్చిమ గోదావరి జిల్లాపై ఏ మాత్రం ప్రభావం చూపించే అవకాశం కూడా కన్పించటం లేదు. ఈ జిల్లాలో చంద్రబాబు సాగిస్తున్న మోడీ వ్యతిరేక, బిజెపి వ్యతిరేక ప్రచారం ప్రభావం నామమాత్రంగా కూడా ఉండదని తేలింది.

Next Story
Share it