Telugu Gateway
Andhra Pradesh

ఏపీ డీజీపీ ఎంపికలో ట్విస్ట్...రాకూర్ కు ఛాన్స్

ఏపీ డీజీపీ ఎంపికలో ట్విస్ట్...రాకూర్ కు ఛాన్స్
X

ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీ నియామకంలో ట్విస్ట్ లు..మలుపులు. చివరి వరకూ విజయవాడ పోలీసు కమిషనర్ గౌతం సవాంగ్ పేరు డీజీపీకి ఖరారైనట్లు ప్రచారం జరిగింది. కానీ అకస్మాత్తుగా తుది ఉత్తర్వులు మాత్రం ఆర్పీ ఠాకూర్ పేరుతో వెలువడ్డాయి. గత కొన్ని రోజులుగా డీజీపీ రేసులో ఎవరు విజేతగా నిలుస్తారనే అంశంపై జోరుగా చర్చలు సాగాయి. మొదటి నుంచి చంద్రబాబు సవాంగ్ వైపు మొగ్గుచూపారని..కానీ మంత్రివర్గంలో కీలకంగా ఉన్న యువ నేత మాత్రం ఠాకూర్ వైపు మొగ్గుచూపారని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కారణాలేంటో తెలియదు కానీ...ఠాకూర్ కే డీజీపీ పదవి దక్కింది.

ప్రస్తుతం అవినీతి నిరోధకశాఖ డైరెక్టర్‌ జనరల్‌గా ఉన్న ఠాకూర్‌ శనివారం నాడే డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు. శనివారం ఉదయం డీజీపీగా మాలకొండయ్య పదవీ విరమణ కార్యక్రమం అనంతరం నూతన డీజీపీ ఎంపికపై చంద్రబాబు కసరత్తు చేశారు. తనపై నమ్మకం ఉంచి డీజీపీగా నియమించినందుకు సీఎం చంద్రబాబుకు ఠాకూర్‌ కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు ఎలాంటి భంగం వాటిల్లకుండా కృషిచేస్తానని నూతన డీజీపీ పేర్కొన్నారు. ఆర్పీ ఠాకూర్‌ 1986 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి. ఆయన పూర్తి పేరు రామ్‌ ప్రవేశ్‌ ఠాకూర్‌.

Next Story
Share it