Telugu Gateway
Politics

కర్ణాటక పీఠంపై యడ్యూరప్ప

కర్ణాటక పీఠంపై యడ్యూరప్ప
X

నాటకీయ పరిణామాల మధ్య కర్ణాటక ముఖ్యమంత్రిగా బిజెఎల్పీ నేత యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ఒక్కరితో ప్రమాణ స్వీకారం ముగిసింది. సభలో విశ్వాస పరీక్ష నెగ్గిన తర్వాతే మంత్రివర్గ ఏర్పాటు జరగనుంది. కాంగ్రెస్ కు ఏ మాత్రం తీసిపోని రీతిలో బిజెపి కూడా ఎక్కడ ఏది తమను అనుకూలంగా ఉంటే..అదే రైట్ అంటూ ముందుకు సాగుతోంది. గోవా, మణిపూర్ ల్లో మెజారిటీ ఉన్న పార్టీలకే ప్రభుత్వ ఏర్పాటు ఛాన్స్ ఇవ్వాలని వాదించిన బిజెపి నేతలు కర్ణాటక విషయానికి వచ్చే సరికి నాలుక మడతేసి..అతి పెద్ద పార్టీకే ఛాన్స్ ఇవ్వాలన్న వాదన తెరపైకి తెచ్చారు. ఎక్కువ మంది రాజ్యాంగ నిపుణులూ ఇదే మాట చెప్పారు. అయితే మరి బిజెపి పాత చర్యల మాటేమిటి? అన్న అంశం వస్తుంది. అంటే మనకు ఏది అనుకూలం అయితే..అదే రూల్ అంటున్నారు బిజెపి నేతలు. గురువారం ప్రమాణ స్వీకారం జరగ్గా గురువారం రాత్రి ఢిల్లీ వేదికగా పలు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. బీజేపీ శాసనసభాపక్ష నేత బీఎస్‌ యడ్యూరప్ప సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం ఆపాలని కోరుతూ కాంగ్రెస్‌-జేడీఎస్‌లు సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాయి.

పిటిషన్‌ను సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించింది. ముగ్గురు న్యాయమూర్తులు జస్టిస్‌ ఏకే సిక్రీ, జస్టిస్‌ భూషణ్‌, జస్టిస్‌ బోబ్డేలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. కాంగ్రెస్‌-జేడీఎస్‌ల తరపును కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి, న్యాయవాది అభిషేక్‌ సింఘ్వి వాదనలు విన్పించారు. బీజేపీ తరపున ఏఎస్‌జీ తుషార్‌ మెహతా వాదనలు సాగాయి. అయితే సుప్రీంకోర్టు గవర్నర్ కు ఆ అధికారం ఉందని తేల్చటంతో కాంగ్రెస్, జెడీఎస్ ల సుప్రీంలో నిరాశ తప్పలేదు. గురువారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు సీఎంగా యడ్యూరప్ప ప్రమాణస్వీకారం చేయడానికి గవర్నర్‌ ఆయనను ఆహ్వానించిన సంగతి తెల్సిందే. బల నిరూపణకు గవర్నర్‌ వాజూభాయ్‌ 15 రోజుల గడువు కూడా ఇవ్వటం కూడా వివాదస్పంద అవుతోంది. సహజంగా వారం రోజుల వ్యవధి సరిపోతుందని..కానీ బేరసారాలు సాగించేందుకు వీలుగానే ఇంత వెసులుబాటు ఇచ్చారనే విమర్శలు విన్పిస్తున్నాయి.

Next Story
Share it