Telugu Gateway
Andhra Pradesh

దుర్గగుడిలో క్షుద్రపూజలు..టీటీడీ పోటులో తవ్వకాలు!

దుర్గగుడిలో క్షుద్రపూజలు..టీటీడీ పోటులో తవ్వకాలు!
X

ఆంధ్రప్రదేశ్ లోని ప్రధాన దేవాలయాల్లో అసలు ఏమి జరుగుతోంది. గతంలో ఎన్నడూలేని రీతిలో ప్రధాన దేవాలయాలు అన్నీ ఎందుకు వివాదాల్లో చిక్కు కుంటున్నాయి. కొద్ది రోజుల క్రితం విజయవాడలో కనకదుర్గ ఆలయంలో జరిగిన క్షుద్రపూజల వ్యవహారం పెద్ద దుమారమే రేపింది. అక్కడ తప్పు జరిగినట్లు ప్రభుత్వం నియమించిన కమిటీ కూడా తేల్చింది. కానీ తప్పు చేసిన వారిపై చర్యలు కరవు. దేవాలయానికి ఏ మాత్రం సంబంధంలేని వారు అర్థరాత్రి గుడిలోకి ప్రవేశించి ఎలా పూజలు చేస్తారు..అక్కడ జరిగిన వ్యవహారం అంతా కూడా ‘రాజకీయ ప్రయోజనాల’ కోసం చేశారనే విమర్శలూ వెల్లువెత్తాయి. దుర్గగుడిలో అర్థరాత్రి పూట జరిగిన క్షుద్రపూజలకు సంబంధించిన వ్యవహారం సీసీటీవీల్లో కూడా రికార్డు అయింది. గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఎంతో పేరున్న తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో చోటుచేసుకుంటున్న పరిణామాలు భక్తులను మనోవేధనకు గురిచేసేవే. తిరుమలలో స్వామివారికి ప్రసాదాలు తయారుచేసే పోటులో ‘ఆభరణాల’ కోసం అని తవ్వకాలు జరిపారంటూ దేవాలయ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు చేసిన ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. ఈవోకు కూడా తెలియకుండా పోటులో తవ్వకాలు చేపట్టాల్సిన అవసరం ఏముంది? అని రమణదీక్షితుల ప్రశ్న.

అంతే కాదు...భక్తులు అందజేసే విలువైన బంగారు కానుకల్లో కొన్నింటిని కరిగించారనే ప్రచారం కూడా జరుగుతోంది. అసలు ఆ అవసరం ఎందుకొచ్చింది అన్నది టీటీడీలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. విలువైన ఆభరణాల గల్లంతు అవుతున్నాయని రమణదీక్షితులు ఆరోపిస్తున్నారు. గతంలో ఎన్నడూలేని రీతిలో కోట్ల మంది భక్తుల విశ్వాసాలతో ముడిపడి ఉన్న టీటీడీ వ్యవహారం ఇప్పుడు భక్తుల్లో ఆందోళన రేపుతోంది. అయితే పోటు ఉన్న ప్రాంతంలో తవ్వకాలు జరిగాయా? లేదా అన్న అంశంపై మాత్రం ఎవరూ స్పష్టమైన సమాధానం చెబుతున్న దాఖలాలు లేవు. టీటీడీ చరిత్రలో ఎన్నడూలేని రీతిలో ఏడాది పాటు అసలు పాలక మండలే లేకుండా చంద్రబాబు సర్కారు...దేవాలయాన్ని కొంత మంది అధికారులకు అప్పగించేసింది. పాలక మండలి ఏర్పాటు చేసినా అందులో అన్యమత విశ్వాసాలు ఉన్న వారిని నియమించారంటూ పెద్ద దుమారమే చెలరేగింది. అయితే ప్రభుత్వ చర్యలు ప్రజల్లో పలు అనుమానాలు పెంచేవిలా ఉన్నాయి.

Next Story
Share it