Telugu Gateway
Andhra Pradesh

రాజధాని కట్టని చంద్రబాబు..నారాయణలకు నోటీసులెవరిస్తారు?

రాజధాని కట్టని చంద్రబాబు..నారాయణలకు నోటీసులెవరిస్తారు?
X

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్రంతో కావాలనే గిల్లికజ్జాలు పెట్టుకుంటున్నారా?. అంటే అవుననే అంటున్నాయి అధికార వర్గాలు. అమరావతిలోని నూతన రాజధాని ప్రాంతంలో అసలు ఎలాంటి శాశ్వత నిర్మాణాలు ఇంత వరకూ మొదలుకాలేదు. అక్కడ ఎలాంటి కార్యకలాపాలు ఏమీలేవు. సౌకర్యాలూ లేవు. నిజంగా ఎస్ బిఐ, ఎల్ఐసీ, ఎఫ్ సీఐ, పోస్టల్, పబ్లిక్ వర్క్స్ సంస్థలు తమ భవనాలు నిర్మించినా ఎలాంటి ఉపయోగం ఉండదు. ఎందుకంటే అక్కడ ఎవరూ లేరు..రాజధాని నిర్మాణం ఇంకా మొదలే కాలేదు కాబట్టి. పోనీ ఈ భూములు ఇచ్చింది ఏమైనా ప్రైవేట్ సంస్థలకా?. అంటే అదీ కాదు. కాకపోతే కొంత ఆలశ్యంగా మొదలవుతాయి పనులు. అంత మాత్రాన కేంద్ర ప్రభుత్వ సంస్థలకు ఈ భూకేటాయింపులు ఎందుకు రద్దు చేయకూడదో తెలపాలంటూ నోటీసులు జారీ చేయాల్సిన అవసరం ఏముంది?. బీఆర్ శెట్టి వంటి ప్రైవేట్ సంస్థలకు మాత్రం మినహాయింపుల మీద మినహాయింపులు ఇచ్చే సర్కారు కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ రంగ బ్యాంకులపై అంత కరకు వైఖరి అవలంభించాల్సిన అవసరం ఉందా?. అంటే ఏ మాత్రం లేదని మునిసిపల్ శాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. ఇది పొలిటికల్ గేమ్ లో భాగంగానే సాగుతోందని ఆయన అన్నారు.

రాజధాని పేరుతో రైతుల దగ్గర నుంచి 33 వేల ఎకరాలు తీసుకుని ఇఫ్పటి వరకూ రాజధానికి సంబంధించి ఒక్క నిర్మాణాన్ని కూడా పూర్తి చేయని ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారాయణలకు నోటీసులు ఎవరు ఇవ్వాలని ఆయన వ్యాఖ్యానించారు. రాజధానికి సంబంధించి రకరకాల డిజైన్లు విడుదల చేస్తూ ప్రజలను ఇప్పటివరకూ ఆశల్లో ఊరేగించారే తప్ప..ఒక్క ప్రాజెక్టు కూడా అమలుకు నోచుకోకపోవటం చంద్రబాబు సర్కారు పెద్ద వైఫల్యంగా మిగలనుందని అన్నారు. ఎన్నికల నాటికి రాజధానికి సంబంధించిన ఒక్క భవనం కూడా పూర్తి అవుతుందో లేదో తెలియని పరిస్థితి అని వ్యాఖ్యానిస్తున్నారు. వాస్తవంగా ఇఫ్పటి వరకూ కోర్ క్యాపిటల్ ప్రాంతానికి సరైన రోడ్లు..ఇతర మౌలికసదుపాయాలు ఏమీలేవు. మరి కేంద్ర సంస్థలు వచ్చి భవనాలు కట్టి...ఊరికే వాటివైపు చూస్తూ కూర్చోవటం తప్ప పెద్ద ఉపయోగం ఉండదని ఆ అధికారి వ్యాఖ్యానించారు. తమ వైపల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కేంద్రంతో పోరాటం అన్న తరహాలో ఈ వ్యవహారం సాగిస్తున్నారని చెబుతున్నారు. నగర నిర్మాణం పూర్తి అయితే తప్ప..కేంద్ర సంస్థలు ఇఫ్పుడు అక్కడ భవనాలు కట్టి చేయాల్సింది ఏమీలేదని చెబుతున్నారు. ప్రైవేట్ సంస్థలకు నోటీసులు ఇస్తే అంటే పనుల్లో వేగం పెంచేందుకు ఓకే కానీ..ఇలా ప్రభుత్వ రంగ సంస్థలు..బ్యాంకులకు నోటీసులు దురుద్దేశపూరితంగా జారీ చేసినవే అని చెబుతున్నారు.

Next Story
Share it