Telugu Gateway
Top Stories

ఈ కామర్స్ రంగంలో అతిపెద్ద డీల్

ఈ కామర్స్ రంగంలో అతిపెద్ద డీల్
X

ప్రపంచ ఈ కామర్స్ రంగంలోనే అతి పెద్ద డీల్. అమెరికాకు చెందిన ప్రముఖ రిటైల్ సంస్థ వాల్ మార్ట్ భారతీయ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ ను చేజిక్కుకుంది. గత కొంత కాలంగా దీనికి సంబంధించిన వార్తలు వస్తున్నా..ఫైనల్ డీల్ మే 9నే జరిగింది. సచిల్ బన్సల్, బిన్నీ బన్సల్ లు 2007 అక్టోబర్ లో బెంగుళూరు కేంద్రంగా ఫ్లిప్ కార్ట్ సంస్థను ప్రారంభించారు. ఇది అంచెలంచెలుగా ఎదిగి..ఈ కామర్స్ రంగంలో ఓ పెద్ద సంచలనంగా మారింది. తాజా డీల్ తో ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌ అధికారికంగా వాల్‌మార్ట్‌ పరమైనట్లు అయింది. ఫ్లిప్‌కార్ట్‌ లో 77 శాతం వాటాను 16 బిలియన్‌ డాలర్లకు తాను కొనుగోలు చేయనున్నట్లు వాల్‌మార్ట్‌ బుధవారం ప్రకటించింది. మొత్తంగా ఫ్లిప్‌కార్ట్‌ వాల్యుయేషన్‌ 20 బిలియన్‌ డాలర్లకు పైగా ఉంది. ఈ ఏడాది చివరి వరకు డీల్‌ను పూర్తి చేయనున్నట్టు వాల్‌మార్ట్‌ తెలిపింది. వాల్‌మార్ట్‌ అధికారికంగా ప్రకటించడానికి ముందు సాఫ్ట్‌ బ్యాంకు సీఈవో మయవోషి సన్‌ కూడా ఈ ఈ విషయాన్ని ధృవీకరించారు. ఈ కామర్స్ రంగానికి సంబంధించి ప్రపంచంలో అతిపెద్ద కొనుగోలు ఇదే. ప్రపంచంలో అత్యంత ఆకర్షణీయమైన రిటైల్‌ మార్కెట్లలో భారత్‌ ఒకటిగా ఉందని వాల్‌మార్ట్‌ అధ్యక్షుడు, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆపీసర్‌ డౌ మెక్‌మిల్లన్‌ అన్నారు,

తమ పెట్టుబడులు భారత కస్టమర్లకు నాణ్యత కలిగి ఉత్పత్తులను, సరసమైన ధరల్లో అందించేందుకు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. అదేవిధంగా కొత్త ఉద్యోగాలు కల్పన, చిన్న సప్లయిర్లకు, వ్యవసాయదారులకు, మహిళా వ్యాపారవేత్తలకు కొత్త కొత్త అవకాశాలు అందనున్నాయని పేర్కొన్నారు. ఫ్లిప్‌కార్ట్‌ లో ఉన్న 20 శాతం వాటాను విక్రయించేసి ఇప్పటి వరకు ఫ్లిప్‌కార్ట్‌లో ప్రధాన పెట్టుబడిదారుగా ఉన్న సాఫ్ట్‌ బ్యాంకు పూర్తిగా ఈ ఈ-కామర్స్‌ దిగ్గజం నుంచి వైదొలగనుంది. సాఫ్ట్‌ బ్యాంక్‌తో పాటు అస్సెల్‌, నాస్పర్స్‌ లు కూడా పూర్తిగా ఫ్లిప్‌కార్ట్‌ నుంచి తప్పుకుంటున్నాయి. టెన్సెంట్‌, టైగర్‌ గ్లోబల్‌, బిన్సీ బన్సాల్‌, మైక్రోసాఫ్ట్‌ లు మాత్రం కొంత వాటాను కలిగి ఉంటున్నాయి. భారత మార్కెట్‌లో అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ ల మధ్య పోటీ ఈ డీల్‌తో మరింత తీవ్రతరంగా మారే అవకాశం కన్పిస్తోంది.

Next Story
Share it