Telugu Gateway
Andhra Pradesh

సింగిల్ టేక్....13 జిల్లాల్లో పవన్ బస్సు యాత్ర

సింగిల్ టేక్....13 జిల్లాల్లో పవన్ బస్సు యాత్ర
X

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయి ‘రాజకీయ టూర్’కు రంగం సిద్ధమైంది. ఏకబిగిన 13 జిల్లాల్లో పర్యటించేందుకు పవన్ కళ్యాణ్ టూర్ మ్యాప్ ఖరారైంది. ప్రతి నియోజకవర్గంలోనూ ఆయన పర్యటన ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ నెల పది లేదా 15 తర్వాత టూర్ ఎప్పుడు ప్రారంభం అయినా...మధ్యలో అతి తక్కువ రోజుల గ్యాప్ తోనే రాష్ట్రమంతటా చుట్టాలని నిర్ణయించుకున్నారు. ఏపీ అంతా ఓ సారి పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకోవటంతోపాటు...అందరి కంటే ముందుగానే తొలి దశ ప్రచారం పూర్తి చేయటానికి జనసేన సిద్ధమైంది. వచ్చే ఎన్నికల్లో పోటీకి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ తాజాగా పూర్తి క్లారిటీ ఇచ్చేశారు. 175 అసెంబ్లీ సీట్లలోనూ బరిలో ఉంటామని స్పష్టం చేశారు. దీంతోపాటు రాజకీయ వ్యూహాల కోసం దేవ్ అనే వ్యూహాకర్తను కూడా నియమించుకున్నారు. పాదయాత్ర లేదా మరో రకంగా పర్యటన తలపెడితే ....అభిమానుల ఒత్తిడితో ముందుకు సాగటం కష్టం కనుక బస్సు యాత్ర ద్వారా రాష్ట్ర పర్యటన చేయాలని పవన్ నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అదే సమయంలో ప్రతి నియోజకవర్గంలోనూ బహిరంగ సభలకు ప్లాన్ చేస్తున్నారు.

కొద్ది రోజుల క్రితం పార్టీ ఆవిర్భావ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు,మంత్రి నారా లోకేష్ లపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయటం ద్వారా పెద్ద సంచలనం సృష్టించిన పవన్ తన బస్సు యాత్ర ద్వారా ఎన్ని సంచలనాలకు కేంద్ర బిందువుగా మారుతారో వేచిచూడాల్సిందే. చంద్రబాబు సర్కారులో చోటుచేసుకున్న కుంభకోణాలకు సంబంధించి పలు ఆధారాలు ఇఫ్పటికే సేకరించిన పవన్...తన బస్సు యాత్ర సమయంలో వీటిని బహిర్గతం చేసే అవకాశం ఉంది. ఇదే జరిగితే అధికార టీడీపీ ఉక్కిరిబిక్కిరి కాక తప్పదు. ఏపీలో ప్రస్తుతం ప్రతి స్కీమ్ లోనూ కోట్లాది రూపాయల స్కామ్ లు వెలుగులోకి వస్తున్నాయి. టెండర్ టెండర్ కు ఓ కొత్త మోడల్ ఫాలో అవుతూ ప్రభుత్వ పెద్దలు దోపిడీ చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. వీటిని చాలా వరకూ మెయిన్ లైన్ మీడియా వెలుగులోకి రాకుండా తొక్కిపెడుతోంది. ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ తన రాష్ట్ర పర్యటన సందర్బంగా పలు స్కామ్ ల వివరాలు కూడా బహిర్గతం చేయటం ద్వారా టీడీపీకి చెక్ పెట్టాలనే యోచనలో ఉన్నారు. పవన్ కొన్ని అంశాల్లో అయినా ఆధారాలు బహిర్గతం చేస్తే ఇది తీవ్ర ప్రభావం చూపించటం ఖాయంగా చెబుతున్నారు.

Next Story
Share it