Telugu Gateway
Telugu

మోడీకి సిద్ధరామయ్య సవాల్

మోడీకి సిద్ధరామయ్య సవాల్
X

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రధాని మోడీకి సవాల్ విసిరారు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పసలేని..అవసరంలేని అంశాలను మోడీ ప్రస్తావిస్తున్నారని ఎద్దేవా చేశారు. తన పోటీ యడ్యూరప్పతోనే అని పేర్కొంటూ...తనతో చర్చకు ఒకే వేదికపైకి యడ్యూరప్ప రాగలరా? అని సవాల్ విసిరారు. దీనికి మోడీ వచ్చినా తనకు అభ్యంతరంలేదన్నారు. తన ప్రధాన ప్రత్యర్థి యడ్యూరప్పే అని వ్యాఖ్యానించారు. కర్ణాటకలోని బిజెపి నేతలు మోడీనే నమ్ముకున్నారని..ఎందుకంటే స్థానిక బిజెపి నేతలకు ప్రజల దగ్గరికి వెళ్ళటానికి మొహం చెల్లటంలేదని ఎద్దేవా చేశారు. మోడీ కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ఎక్కడా కూడా ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తిలా మాట్లాడటం లేదని అన్నారు. ఆదివారం నాడు తన ప్రచారంలో మోడీ ముధోల్ జాతి శునకాల నుంచి అయినా కాంగ్రెస్ దేశభక్తిని నేర్చుకోవాలంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై ట్వీట్ చేసిన సిద్ధరామయ్య బిజెపి నేతలకు సవాల్ విసిరారు.

ప్రధాని మోడీ మాటలను కర్ణాటక ప్రజలు ఏ మాత్రం విశ్వసించరని వ్యాఖ్యానించారు. ప్రజలను ఆకర్షించేందుకే మోడీ వ్యవసాయ కూలీలకు ప్రమాద బీమా, మహాదయి వివాదం వంటి అంశాలను లేవనెత్తుతున్నారని ఆరోపించారు. హైఓల్టేజ్ స్థాయిలో సాగుతున్న కర్ణాటక ఎన్నికల ప్రచారం ప్రస్తుతం పీక్ కు చేరింది. కర్ణాటకలో ఈ నెల12న ఒకేసారి 224 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు ఈ నెల 15న వెల్లడికానున్నాయి. ఇంత కాలం రాహుల్ మాత్రమే కాంగ్రెస్ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించగా..ఇప్పుడు సోనియాగాంధీ కూడా బరిలోకి దిగనున్నారు. బిజెపి తరపున మోడీ, అమిత్ షాలు భారీ ఎత్తున హోరెత్తిస్తున్నారు.

Next Story
Share it