Telugu Gateway
Andhra Pradesh

ఆయన లోకేష్ కే ‘బాషా’... మాకు కాదు

ఆయన లోకేష్ కే ‘బాషా’... మాకు కాదు
X

పి. రంజిత్ బాషా. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల డైరక్టర్. సహజంగా ఈ పోస్టు సీనియర్ ఐఏఎస్ అధికారులకు మాత్రమే ఇస్తారు. కానీ ఏపీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్..నేను ఒక్క సారి చెపితే వందసార్లు చెప్పినట్లే అంటూ...తనకు సన్నిహితుడు అయిన రంజిత్ బాషా కు ఈ పదవి అప్పగించారు. తొలుత రంజిత్ బాషా లోకేష్ పేషీలో పనిచేశారు. తర్వాత ఆయనకు కన్ఫర్డ్ ఐఏఎస్ హోదా వచ్చింది. ఆ తర్వాతే అత్యంత జూనియర్ అధికారి అయినా సరే లోకేష్ తాను కోరుకున్నట్లు రంజిత్ బాషాను సీనియర్లను నియమించే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ డైరక్టర్ గా నియమించారు. అంత వరకూ బాగానే ఉంది. అక్కడే అసలు సమస్య మొదలైంది. ఐఏఎస్ ల మధ్య ప్రొటోకాల్ వ్యవహారం ఒకింత సీరియస్ గానే ఉంటుంది. సీనియర్ అధికారికి ఎవరైనా ఫోన్ చేయాలంటేనే...ముందు జూనియర్ అధికారి లైన్ లో ఉండి మరీ లైన్ కలపమంటారు. అంతగా ఫాలో అవుతారు సీనియర్...జూనియర్ ల ప్రోటోకాల్. ఢిల్లీలోని అధికారులతో మాట్లాడే సమయంలోనూ ఇదే వ్యవహారం నడుస్తుంది.

లోకేష్ తాను కోరుకున్నట్లు రంజిత్ బాషాకు పదవి అయితే అప్పగించారు కానీ అందరూ ఐఏఎస్ లకు ఫోన్ చేసి రంజిత్ బాషా చెప్పినట్లు చేయాలని చెప్పలేరు కదా?. అక్కడే వస్తుంది అసలు సమస్య. రంజిత్ బాషా జిల్లాల పర్యటనలకు వెళ్లినప్పుడు కొన్ని చోట్ల డైరక్ట్ రిక్రూటీలు అయిన ఐఏఎస్ అధికారులు కనీసం ఆయన్ను కలవటానికి ఇష్టపడని పరిస్థితి. కలెక్టర్లు అయితే చాలా చోట్ల డోంట్ కేర్ అంటున్నారు. ఈ వ్యవహారం రంజిత్ బాషాకు పెద్ద తలనొప్పి వ్యవహారంగా మారిందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. జిల్లాల్లో పంచాయతీరాజ్ శాఖ అమలు చేసే పథకాల సమీక్ష కోసం రంజిత్ బాషా సమీక్షలకు వెళితే ఆయనకు పలు చోట్ల చేదు అనుభవాలు ఎదురవుతున్నాయని..ఆయన లోకేష్ కు గొప్ప అయితే కావొచ్చు కానీ..తమకు కాదని ఓ కలెక్టర్ వ్యాఖ్యానించారు. దీంతో రంజిత్ బాషా పరిస్థితి దారుణంగా ఉందని చెబుతున్నారు.

Next Story
Share it