Telugu Gateway
Andhra Pradesh

చంద్రబాబులాగా నాకు హెరిటేజ్ లేదు

చంద్రబాబులాగా నాకు హెరిటేజ్ లేదు
X

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన ఫస్ట్ డే టూర్ లోనే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై ‘పంచ్’లు వేశారు. తనకు ముఖ్యమంత్రి చంద్రబాబులాగా ‘హెరిటేజ్’ సంస్థలేదని వ్యాఖ్యానించారు. టీడీపీ చంద్రబాబు పెట్టింది కాదని..ఎన్టీఆర్ పార్టీలో చంద్రబాబు చేరి..అక్కడ నుంచి ఆయన చేతిలోకి తీసుకున్నారన్నారు. జనసేన తాను సొంతంగా స్థాపించుకున్న పార్టీ..జనసేనకు జనం బలం తప్ప మరేమీలేవన్నారు. డబ్బు సంపాదించటానికి తాను రాజకీయాల్లోకి రాలేదన్నారు. విభజన తర్వాత రాష్ట్రానికి అనుభవం ఉన్న నాయకుడు కావాలని భావించే చంద్రబాబుకు మద్దతు ఇచ్చామని తెలిపారు. అంతమాత్రాన నిత్యం బానిసల్లా అక్కడే పడి ఉండాలా? అని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్. చంద్రబాబు నుంచి తాను పదవులు కోరుకోలేదు...కాంట్రాక్ట్ లు కోరుకోలేదన్నారు. పుష్కరాలు..విదేశీ యాత్రల పేరుతో చంద్రబాబు ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు అపార అనుభవం అవినీతికి పనికొచ్చందనని దుయ్యబట్టారు. బీజేపీకి భయపడుతున్నది చంద్రబాబేనన్నారు.

ఎందుకు భయపడుతున్నారో వారికే తెలియాలని అన్నారు. తాను ఎవరికీ భయపడను...ఆడించడానికి పవన్‌ బొమ్మకాదని తేల్చిచెప్పారు. తాను భయపడే వ్యక్తినైతే రాజకీయాల్లోకి వచ్చే వాడిని కాదని, కేంద్ర ప్రభుత్వంపై విశ్వాసం కోల్పోయామని, రాష్ట్ర ప్రభుత్వం నిధులు లేవని అబద్ధాలు చెబుతోందని పవన్ ఆరోపించారు. అధికారం...అభివృద్ధి కొందరి చేతుల్లోనే ఉండటం సరికాదని, చట్టసభల్లో ఇచ్చిన హామీలను చిత్తశుద్ధితో అమలు చేస్తారని నమ్మానని చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురంలో జనసేన ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ ‘అధికారంపై నాకు ఆశలేదు. జనసేన కార్యకర్తలపై దాడులు చేస్తే ఊరుకోబోం. దాడులు, దౌర్జన్యాలు చేస్తే చేతులు కట్టుకుని కూర్చోబోం. జనసేనను విమర్శించడం విపక్షాలకు పరిపాటిగా మారింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయ పార్టీని స్థాపించి... పోరాటాలు చేయడం కష్టమైన పని. నన్ను సీఎం చేయండి....కష్టాలు తీరుస్తానని చెప్పను. రాజకీయాలు నేర్చుకుంటున్నా...ప్రజల కష్టాలు తెలుసుకుంటున్నా. అందరి అభివృద్ధిని కోరుకునే పార్టీ జనసేన అని’ పవన్‌ స్పష్టం చేశారు.

Next Story
Share it