Telugu Gateway
Movie reviews

‘మెహబూబా’ మూవీ రివ్యూ

‘మెహబూబా’ మూవీ రివ్యూ
X

ఇది రెండు జన్మల ప్రేమ కథ. ఈ తరహా సినిమాలు గతంలో వచ్చినా దర్శకుడు పూరీ జగన్నాథ్ ఈ ప్రేమ విషయంలో రెండు దేశాల అంశాన్ని జోడించారు. అవే ఇండియా, పాకిస్తాన్. ఈ సినిమాలో ప్రేమ జంటగా రోషన్ (ఆకాష్ పూరీ), ఆఫ్రిన్ (నేహషెట్టి) నటించారు. తొలి జన్మలో రోషన్ పాకిస్థాన్ లో పుడితే...ఆఫ్రిన్ ఇండియాలో పుడుతుంది. మరో జన్మలో రోషన్ ఇండియాలో...ఆఫ్రిన్ పాకిస్థాన్ లో పుడతారు. చిన్నప్పటి నుంచో వీళ్లిద్దరికి గత జన్మకు సంబంధించిన విషయాలు గుర్తుకొస్తుంటాయి. చివరకు చావు దగ్గర నుంచి. రోషన్ కు చిన్నప్పటి నుంచీ ఆర్మీలో చేరాలని ఆశ. తన కోరిక మేరకు ఆర్మీలో చేరతాడు. పాకిస్థాన్ లో పుట్టిన ఆఫ్రిన్ చదువు కోసం భారత్ కు వస్తుంది. అప్పటికే ఆఫ్రిన్ కు పాక్ లో పెళ్ళి కుదురుతుంది. అయితే చదువు అయిన తర్వాతే పెళ్లి చేసుకుంటానని చెప్పి..భారత్ కు బయలుదేరుతుంది. హైదరాబాద్ లో హాస్టల్ లో ఉండి చదువుకునే క్రమంలో ఓ ముఠా ఆఫ్రిన్ ను ఎత్తుకుపోయేందుకు ప్రయత్నిస్తుంది. ఆ క్రమంలో రోషన్ ఆమెను రక్షిస్తాడు. అయినా వాళ్లిద్దరూ అప్పుడు కలుసుకోరు.

ట్రెక్కింగ్ కోసం మిత్రులతో బయలుదేరిన ఆకాష్...తిరిగి పాకిస్థాన్ వెళ్ళేందుకు బయలుదేరిన ఆఫ్రిన్ లు రైలులో తారసపడతారు. అప్పటి నుంచి వీరిద్దరికి పాత విషయాలు గుర్తుకొస్తాయి. కానీ పాకిస్థాన్ లో ఆఫ్రిన్ కు కుటుంబ సభ్యులు చూసిన వ్యక్తితో పెళ్ళి చేసేందుకు ప్రయత్నాలు చేస్తారు. విషయం తెలుసుకున్న రోషన్ ఎలాగైనా ఆఫ్రిన్ ను పెళ్లి చేసుకునేందుకు పాకిస్థాన్ బయలుదేరతాడు. అక్కడ నుంచి ఆఫ్రిన్ ను భారత్ ఎలా తీసుకొచ్చారన్నదే సినిమా. గత సినిమాలతో పోలిస్తే ఆకాష్ పూరీ మెహబూబాలో నటనలో చాలా పరిణితి చూపించాడు. ముఖ్యంగా పాకిస్థాన్ కు సంబంధించిన అంశంలో డైలాగులు ఆకట్టుకునేలా ఉన్నాయి. హీరోయిన్ నేహ షెట్టి కూడా తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు.

మెహబూబా సినిమాలో ముఖ్యంగా యుద్ధ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఈ సినిమాలో మొత్తం మీద పాకిస్థాన్ కు సంబంధించిన అంశాలు వచ్చిన సందర్భంలో తప్ప...మిగిలిన సమయంలో జోష్ కన్పించదు. ఇండియా-పాక్ క్రికెట్ మ్యాచ్ సందర్భంలో చోటుచేసుకునే సంభాషణలు సినిమాలో హైలెట్ గా నిలుస్తాయి. గత కొంత కాలం హిట్ కోసం ఎదురుచూస్తున్న దర్శకుడు పూరీ జగన్నాథ్ కు ఈ సినిమా కూడా ఆశించిన స్థాయి విజయాన్ని అందించలేదనే చెప్పొచ్చు. కొడుకును రీలాంచ్ చేసేందుకు పూరీ సొంతంగానే ఈ సినిమాను నిర్మించారు. ఓవరాల్ గా చూస్తే ‘మెహబూబా’ ఓ సగటు ప్రేమ కథగానే మిగులుతుంది.

రేటింగ్. 2.5/5

Next Story
Share it