Telugu Gateway
Top Stories

బలపరీక్షలో నెగ్గిన కుమారస్వామి

బలపరీక్షలో నెగ్గిన కుమారస్వామి
X

కర్ణాటక అసెంబ్లీలో ముఖ్యమంత్రి కుమారస్వామి బలపరీక్ష వ్యవహారం సాపీగా సాగిపోయింది. 104 మంది సభ్యులతో అతి పెద్ద పార్టీగా అవతరించిన బిజెపి విశ్వాస పరీక్షకు ముందే వాకౌట్ చేయటంతో బలపరీక్ష ఏకపక్షంగా సాగిపోయింది. కాంగ్రెస్, జెడీఎస్ సభ్యులు అందరూ సభలో చేతులు ఎత్తి సర్కారుకు మద్దతు ప్రకటించటంతో స్పీకర్ రమేష్ కుమార్ ఫలితాన్ని ప్రకటించారు. విశ్వాస పరీక్షలో నెగ్గటంతో జెడీఎస్, కాంగ్రెస్ సభ్యులు పరస్పరం అభినందనలు తెలుపుకున్నారు. ఇక ఇప్పుడు కాంగ్రెస్ కు మంత్రివర్గ కూర్పు పెద్ద సవాల్ గా మారనుంది. పదవులు ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండటం, పరిమితుల దృష్టా ఎంత సులభంగా కాంగ్రెస్ ఈ సమస్య నుంచి గట్టెక్కుతుందనేది ఆసక్తికర అంశంగా మారనుంది. అంతకు ముందు సీఎం కుమారస్వామి విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి అసెంబ్లీలో మాట్లాడారు. కర్ణాటకలో ఏ పార్టీకి ప్రజలు స్పష్టమైన మెజారిటీ ఇవ్వలేదని అన్నారు. సంకీర్ణ ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడుపుతామన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే కాంగ్రెస్‌-జేడీఎస్‌ కలిశాయని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా బీజేపీ వ్యవహరించిందని విమర్శించారు. హంగ్‌ అసెంబ్లీ రాష్ట్రానికి కొత్తేమీ కాదని, 2004లో కూడా ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాలేదని గుర్తు చేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించిన కాంగ్రెస్‌ పార్టీకి కృతజ్ఞతలు చెప్పారు.

విశ్వాసపరీక్ష జరగటానికి ముందు బిజెపి నేత యడ్యూరప్ప సభలో కాంగ్రెస్, జెడీఎస్ లపై నిప్పులు చెరిగారు. ఈ రెండు పార్టీలదీ అపవిత్ర పొత్తని అభివర్ణించారు. ప్రభుత్వ ఏర్పాటు కోసం కుమారస్వామి దిగజారారని, అధికారం కోసం అర్రులు చాస్తున్న ఆయన రాజ్యాంగ ద్రోహి అని విమర్శించారు. కుమారస్వామి సర్కార్‌పై విశ్వాసతీర్మానంపై చర్చ సందర్భంగా ప్రజాభీష్టానికి కాంగ్రెస్‌ ద్రోహం చేసిందని మండిపడ్డారు. కుమారస్వామితో గతంలో కలిసి పనిచేసినందుకు బాధపడుతున్నానని వ్యాఖ్యానించారు. 37 సీట్లు సాధించిన జేడీఎస్‌ ప్రభుత్వం ఎలా ఏర్పాటు చేస్తుందని ప్రశ్నించారు. 16 జిల్లాల్లో జేడీఎస్‌కు ఒక్క సీటు కూడా రాలేదని, అలాంటి పార్టీతో కాంగ్రెస్‌ పొత్తు పెట్టుకుందని ఎద్దేవా చేశారు. అధికారం కోసం రెండు పార్టీలూ దిగజారాయని ఆరోపించారు. కుమారస్వామిని ముఖ్యమంత్రిని చేసినందుకు డీకే శివకుమార్‌ చింతిస్తారని అన్నారు. తన పోరాటం కాంగ్రెస్‌పై కాదని, అవినీతిపరులైన దేవెగౌడ, కుమారస్వామిలపైనేనని స్పష్టం చేశారు.

Next Story
Share it