Telugu Gateway
Andhra Pradesh

హైదరాబాద్ లో కర్ణాటక కాంగ్రెస్..జెడీఎస్ ఎమ్మెల్యేలు

హైదరాబాద్ లో కర్ణాటక కాంగ్రెస్..జెడీఎస్ ఎమ్మెల్యేలు
X

కర్ణాటక రాజకీయం హైదరాబాద్ కు మారింది. కర్ణాటకలో ఉంటే కష్టం అని భావించిన కాంగ్రెస్, జెడీఎస్ లు తమ ఎమ్మెల్యేలను ప్రత్యేక విమానాల్లో తరలించేందుకు ప్రయత్నించగా...ఏటీసీ క్లియరెన్స్ రాకపోవటంతో చేసేదేమీ లేక హైదరాబాద్ కు బస్సుల్లో తరలించారు. దీంతో శుక్రవారం ఉదయం రెండు పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు ప్రత్యేక బస్సుల్లో హైదరాబాద్ చేరుకున్నారు. వీరికి నగరంలోని పలు స్టార్ హోటళ్లలో బస కల్పించారు. అత్యంత కీలకంగా మారిన కర్ణాటక రాజకీయంలో ఎలాగైనా విజయం సాధించాలని కాంగ్రెస్, జెడీఎస్ కసితో పనిచేస్తున్నాయి. అయితే బిజెపి కూడా ఎలాగైనా ఎమ్మెల్యేలు కొంత మందిని తమ వైపు తిప్పుకుని గండం నుంచి గట్టెక్కాలని ప్రయత్నిస్తోంది.

అయితే ఈ పోరాటంలో ఎవరు విజయం సాధిస్తారనేది ప్రస్తుతానికి అంతుచిక్కన ప్రశ్నగా మారింది. సాంకేతికంగా చూస్తే కాంగ్రెస్, జెడీఎస్ ల వైపే మెజారిటీ ఉంది. అయితే ఓటింగ్ జరిగే సమయానికి ఇది ఎలా మారుతుంది అన్నది సస్పెన్స్. ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేసినా... కర్ణాటకలో అధికార పీఠం కోసం రాజకీయ పార్టీల మధ్య పోరు పీక్ కు చేరింది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు ఆ పార్టీ సీనియర్‌ నేత డీకే శివకుమార్‌ నేతృత్వం వహిస్తున్నారు. కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్‌ హైదరాబాద్‌ చేరుకున్నారు. జేడీఎస్ ఎమ్మెల్యేలను వివిధ ప్రదేశాలకు తరలించడంపై జేడీఎస్ నేత కుమారస్వామి స్పందించారు. తమ ఎమ్మెల్యేల మీద పూర్తి నమ్మకముందని.. కానీ గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నామన్నారు. సుప్రీంకోర్టులో తాజా పరిణామాలు చూస్తుంటే..అసెంబ్లీ బలపరీక్ష వెంటనే ఉంటే అవకాశం ఉంది. దీంతో ఈ ఎమ్మెల్యేలు అందరూ తిరిగి కర్ణాటకకు పోక తప్పేలా లేదు.

Next Story
Share it