Telugu Gateway
Andhra Pradesh

టీడీపీ జాతీయ పార్టీనా...ప్రాంతీయ పార్టీనా?

టీడీపీ జాతీయ పార్టీనా...ప్రాంతీయ పార్టీనా?
X

మాట్లాడితే మాది జాతీయ పార్టీ అంటారు. తెలంగాణ, ఏపీలకు విడివిడిగా అధ్యక్షులను కూడా నియమించారు. చంద్రబాబునాయుడు జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు. తెలుగుదేశం ఇప్పుడు స్వయం ప్రకటిత జాతీయ పార్టీగా మారింది. కానీ కర్ణాటకలో లక్షలాది మంది తెలుగు ఓటర్లు ఉన్నా కనీసం అక్కడ పోటీ చేసే ప్రయత్నం చేయలేదు. పైగా బిజెపికి కాకుండా కాంగ్రెస్ కు ఓటు వేయమని మరీ అధికారికంగా ప్రచారం చేశారు. ఇప్పుడు మహానాడు వేదికగా రాజకీయ తీర్మానం సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మొదలుకుని ఆ పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలు విచిత్రంగా అన్పించకమానవు. 2019 ఎన్నికల్లో బిజెపి ఓడిపోవటం ఖాయం అని...ప్రాంతీయ పార్టీలే కేంద్రంలో చక్రం తిప్పుతాయని ప్రకటిస్తారు. కాంగ్రెస్ కు కూడా మెజారిటీ రాదని..వచ్చే ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీల హవా కొనసాగుతుందని చెబుతున్నారు. కానీ కేంద్రం వరకూ వచ్చేసరికి మాత్రం ప్రాంతీయ పార్టీల హవా సాగుతుందని..చక్రం తిప్పుతాయని చెబుతారు.

కానీ మళ్ళీ తమ వరకూ వచ్చేసరికి మాత్రం తమది జాతీయ పార్టీ అని ప్రకటించుకుంటారు. ఈ విషయంలో టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు పార్టీ నేతలందరికీ క్లారిటీ కొరవడినట్లు ఉందని ఓ సీనియర్ నేత విశ్లేషించారు. దీనిపై పార్టీ వర్గాల్లో కూడా ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఏపీలో ప్రస్తుతం అధికారంలో ఉన్నా..తెలంగాణలో పార్టీ చుక్కాని లేని నావలాగా సాగుతోంది. తెలంగాణలో టీడీపీని దారుణంగా దెబ్బతీయటంలో చంద్రబాబు పాత్రే ఎక్కువ అని ఆ పార్టీ నేతలే బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఓ సారి పోరాటం చేయాల్సిన అవసరం లేదని తెలంగాణ నేతలకు సెలవిచ్చారు. మరోసారి ప్రజలకు చేరువ అయి పార్టీ ఉనికిని కాపాడాలని కోరారు. తాజాగా కర్ణాటక లోని జెడీఎస్ తరహాలో టీడీపీ లేకుండా తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు సాధ్యం కాదని ప్రకటిస్తున్నారు. హైదరాబాద్ లో జరిగిన మహానాడులో కూడా టీఆర్ఎస్ పై, సీఎం కెసీఆర్ పై చంద్రబాబు ఒక్కటంటే ఒక్క మాట కూడా మాట్లాడకుండా జారుకున్న విషయం తెలిసిందే. పార్టీ నేతల వ్యాఖ్యలు చూస్తుంటే అసలు తమది జాతీయ పార్టీనా?. లేక ప్రాంతీయ పార్టీనా అర్థం కాకుండా ఉందని టీడీపీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. టీడీపీ వచ్చే ఎన్నికల తర్వాత కేంద్రంలో ప్రాంతీయ పార్టీగా చక్రం తిప్పుతుందా?. జాతీయ పార్టీగా తిప్పుతుందా?

Next Story
Share it