Telugu Gateway
Telangana

మోడీని ఢీకొట్టే బాబుకు..కెసీఆర్ అంటే భయమెందుకు!

ప్రధాని మోడీని ఢీకొడతా. పడగొడతా అని సవాళ్లు విసురుతున్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. ఓకే. ఏ పార్టీకి నచ్చినట్లు ఆ పార్టీ చేసుకోవచ్చు. ఎవరికీ అభ్యంతరం ఉండకపోవచ్చు. మరి తెలంగాణలో తెలుగుదేశం బలపడాలి. బలపడితే అందరూ మన చుట్టూ తిరుగుతారు అని ప్రకటించిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు హైదరాబాద్ వేదికగా జరిగిన మహానాడులో తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ పై ఒక్కటంటే ఒక్క మాట ఎందుకు అనలేకపోయారు?. కనీసం టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఏమైనా విమర్శలు చేశారా? అంటే అదీ లేదు. తెలంగాణ టీడీపీ నేతలు ఏదో మాట్లాడారంటే మాట్లాడారు కానీ...చంద్రబాబు తెలంగాణ సీఎం కెసీఆర్ ను విమర్శించే సాహసం చేయలేకపోయారు. ప్రతిపక్షంలో ఉన్న ఏ పార్టీ అయినా అధికార పార్టీ తప్పిదాలపై పోరాడాలి. తప్పులను ఎత్తిచూపాలి. అది ప్రతిపక్షం బాధ్యత కూడా. కానీ తెలంగాణలో టీడీపీ అలాంటిదేమీ చేయటం లేదు. అంతా స్తబ్దుగా ముందుకు సాగుతుంది. మహానాడు వంటి వేదికపై నుంచి తెలంగాణలోని పార్టీ క్యాడర్ కు చంద్రబాబు ఎలాంటి సంకేతం అందించారు.

తెలంగాణలో అధికారంలో ఉన్న పార్టీని ఒక్కటంటే ఒక్క విమర్శ చేయకపోవటానికి కారణం ఏంటి?. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు సహజంగా సొంతంగా అధికారంలోకి రావాలని కోరుకుంటారు. కానీ అదేమి విచిత్రమో చంద్రబాబు మాత్రం కర్ణాటక తరహాలో తెలంగాణలో ఓ పదిహేను ...20 సీట్లు సాధిస్తే నిర్ణయాత్మక పాత్ర పోషించాలని కోరుకుంటున్నారు. అంతే తప్ప..పార్టీ సొంతంగా అధికారంలోకి వస్తుందనే ధీమా ఇవ్వలేకపోయారు. ఆ పరిస్థితి లేకపోవటం ఓకే. కానీ నాయకుడే నేతల్లో..కార్యకర్తల్లో విశ్వాసం నింపలేకపోతే ఎవరు నింపుతారు?. కేంద్రంలో ప్రస్తుతానికి అత్యంత శక్తివంతంగా ఉన్న ప్రధాని మోడీని ఢీకొడుతున్నానని చెప్పుకునే ఈ సూపర్ సీనియర్ నేత ఎందుకు కెసీఆర్ విషయంలో మౌనం దాల్చాల్సి వస్తోంది. అంతగా భయపడాల్సిన తప్పులు ఏమి చేశారు చంద్రబాబు?. ఇది టీడీపీ నేతలకు మింగుపడని అంశం.

Next Story
Share it