Telugu Gateway
Andhra Pradesh

జగన్ ను గెలిపించిన చంద్రబాబు

జగన్ ను గెలిపించిన చంద్రబాబు
X

అదేంటి?. జగన్ ను చంద్రబాబు గెలిపించటం ఏమిటి? అంటారా?. అదేంటో మీరే చూడండి. సంబంధం లేని విషయాల్లో జోక్యం చేసుకుంటే ఎలా ఉంటుందో కర్ణాటక ఫలితాలు తెలుగుదేశానికి స్పష్టంగా తెలియజేశాయి. ఇప్పుడు ఈ ఫలితాలు టీడీపీకి పెద్ద దెబ్బగా మారబోతున్నాయి కూడా. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అయితే బహిరంగంగా ‘బిజెపి’కి ఓటు వేయవద్దని తిరుపతి ధర్మపోరాట సభ నుంచి పిలుపునిచ్చారు. అయితే తెలుగు ప్రజలు ఎవరూ చంద్రబాబు, టీడీపీ నేతల పిలుపును ఏ మాత్రం పట్టించుకోలేదని స్పష్టం అవుతోంది. కర్ణాటకలో తెలుగు ప్రజలు భారీ ఎత్తున ఉన్నారు. ఏపీ ఎన్జీవో నేత అశోక్ బాబు అయితే కర్ణాటక వెళ్ళి మరీ తెలుగు సంఘాలతో సమావేశం అయి బిజెపికి వ్యతిరేకంగా ఓటు వేయాలని కోరారు. ప్రత్యేక హోదాతోపాటు పలు విషయాల్లో మోడీ సర్కారు ఏపీకి అన్యాయం చేసినందున కర్ణాటక ఎన్నికల్లో తెలుగు ప్రజలందరూ బిజెపికి వ్యతిరేకంగా ఓటు వేయాలని కోరారు. కానీ ఫలితాలను పరిశీలిస్తే చంద్రబాబు డిమాండ్ ను తెలుగు ప్రజలు ఏ మాత్రం పట్టించుకున్నట్లు కన్పించలేదు. అంటే అక్కడ ఉన్న తెలుగువారికి ఏపీపై ఏ మాత్రం ప్రేమలేదన్నట్లా?. ఖచ్చితంగా ఏ మాత్రం కాదని చెప్పొచ్చు. ఓటు అనేది అక్కడ పరిస్థితులకు అనుగుణంగా..వారి వారి అభిప్రాయాల ప్రకారం వేసుకుంటారు. అంతే తప్ప...చంద్రబాబు చెప్పారనో..లేక మరొకరు చెప్పారనే పరిగణనలోకి తీసుకోరు.

వాస్తవానికి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కర్ణాటక ఎన్నికల గురించి బహిరంగంగా ఎక్కడా మాట్లాడలేదు. అయితే టీడీపీ మాత్రం వైసీపీ అనుకూలురు అంతా కర్ణాటకలో బిజెపికి అనుకూలంగా ప్రచారం చేస్తున్నారని...ఏపీకి అన్యాయం చేసిన మోడీకి, బిజెపికి వ్యతిరేకంగా జగన్ ఎందుకు ప్రకటన చేయరని పదే పదే ప్రశ్నలు వేశారు. వీరిద్దరి కుమ్మక్కుకు అంతకంటే నిదర్శనం ఏమి కావాలని ప్రశ్నలు సంధించారు. మంగళవారం నాడు కూడా టీవీ చర్చల్లోనూ ఇదే వాదన విన్పించారు. అంటే చంద్రబాబు పిలుపు ఇచ్చినా పట్టించుకోని తెలుగు ఓటర్లు...ఓ మాట చెప్పకపోయినా జగన్ మాటకు విలువ ఇఛ్చినట్లా?. తెలుగుదేశం నేతల మాటలు చూస్తే ఎవరైనా అలాగే అనుకోవాల్సి వస్తుంది మరి. తెలుగుదేశం నేతల వాదన ప్రకారం చూస్తే కర్ణాటకలో చంద్రబాబు ఓడిపోయారు...జగన్ గెలిచారు. మరి ఈ ప్రభావం రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందో వేచిచూడాల్సిందే. కర్ణాటకలో బిజెపినే అతిపెద్ద పార్టీగా అవతరించబోతోంది

Next Story
Share it