Telugu Gateway
Andhra Pradesh

కేంద్రంపై చంద్రబాబు తిరుగుబాటు ఇలాగా?

కేంద్రంపై చంద్రబాబు తిరుగుబాటు ఇలాగా?
X

పోలవరంకు డబ్బులు ఇవ్వరా?. మేమే కట్టుకుంటాం. రాజధానికి నిధులు ఇవ్వరా?. అయినా మేమే నిర్మించుకుంటాం. ఏపీలోని జాతీయ రహదారులు బాగుచేయరా?. మేమే చేసుకుంటాం. ఈ రహదారులకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న జాతీయ రహదారులు అని పేరు పెట్టుకుంటాం. ఇదీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి తీరు. ఇది కేంద్రంపై పోరాటం అవుతుందా?. ఇదెక్కడి పోరాటం. ఇదేం తీరు? అని అధికార వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. పోలవరం, రాజధాని నిర్మాణం వంటి అంశాలు విభజన చట్టంలో విస్పస్టంగా ఉన్నాయని..అలాంటి వాటి విషయంలో చంద్రబాబు ధోరణి ఏ మాత్రం సరిగాలేదనే వాదన ప్రభుత్వ వర్గాల నుంచే విన్పిస్తోంది. ప్రతి విషయంలో చంద్రబాబు ఇదే ధోరణి అవలంభిస్తే ఏపీ ప్రజలపై భారీ ఎత్తున భారం మోపినట్లు అవుతుందని చెబుతున్నారు. చంద్రబాబు వైఫల్యాలకు ప్రజలు ఎందుకు భారం మోయాలి? అని ప్రశ్నిస్తున్నారు. అందుబాటులో ఉన్న అన్ని మార్గాల ద్వారా కేంద్రం నుంచి నిధులు తెచ్చుకునే ప్రయత్నం చేయాలి కానీ..ఇదేదో వ్యక్తిగత వ్యవహారంలా ప్రవర్తించటం సరికాదని ఓ సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు.

రాజధాని నిర్మాణం, మౌలికసదుపాయాలకు కేంద్రం ఖచ్చితంగా నిధులు ఇవ్వాల్సి ఉన్నా...అది 33 వేల ఎకరాల్లో నిర్మాణానికి ఇవ్వదు అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే రాజధానికి కేంద్రం నుంచి ఎంత సాయం వస్తుందనే అంశంపై ప్రభుత్వంలో కొనసాగిన నాలుగేళ్లలో ఓ అంగీకారానికి కూడా రాలేకపోవటం దారుణమని చెబుతున్నారు. రాజధాని నిర్మాణం..మౌలికసదుపాయాల కల్పనకు దాదాపు ఏభై వేల కోట్ల రూపాయల వరకూ అవసరం అవుతాయని ఏపీసీఆర్ డీఏ అంచనా వేస్తోంది. అయితే ఈ విషయాన్ని కేంద్రం ముందు పెట్టి...ఓ అంగీకారానికి వచ్చే ప్రయత్నమే జరగలేదని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. పైగా ప్రతి విషయంలో ఏదో చిన్న పిల్లాడు అలిగినట్లు ఇలా అయితే అన్నీ తామే చేసుకుంటామని వ్యాఖ్యానించటం ఏమిటని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

Next Story
Share it