Telugu Gateway
Andhra Pradesh

చంద్రబాబుది....చిల్లులు..జల్లుల రాజధాని

చంద్రబాబుది....చిల్లులు..జల్లుల రాజధాని
X

టీడీపీ అధినేత చంద్రబాబు అనుభవం అక్కరకు వస్తది అనుకున్నారు అందరూ. అందుకే గత ఎన్నికల్లో ఓట్లు వేశారు. చంద్రబాబు కూడా అదే మాట చెప్పారు. విభజనకు గురైన ఆంధ్రప్రదేశ్ కు చారిత్రక రాజధాని కడతానని నమ్మించారు. కొన్ని రోజులు సింగపూర్ పేరుతో మోసం చేశారు. తర్వాత డిజైన్ల పేరుతో మూడేళ్ళ పాటు కాలయాపన చేశారు. కానీ ఇంత వరకూ ఒక్క ‘చిల్లులు..జల్లుల రాజధాని’ తప్ప ఆయన కట్టింది ఏమీలేదు. మరి కొద్ది రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయి. కానీ శాశ్వత రాజధానికి సంబంధించి ఇప్పటివరకూ ఒక్క అడుగు ముందుకు పడలేదు. కొత్త రాష్ట్రం కదా? అని చంద్రబాబును నమ్మి అమరావతి ప్రాంతంలోని రైతులు అయితే 33 వేల ఎకరాల భూమిని పూలింగ్ లో ఇచ్చి తమ ఉదారతను చాటుకున్నారు. కానీ చంద్రబాబు మాత్రం నిత్యం తన దోపిడీ స్కీమ్ ల ప్రకారం ముందుకెళ్ళారే తప్ప..ఎక్కడా శాశ్వత రాజధాని నిర్మాణం విషయంలో చొరవ చూపలేదని మునిసిపల్ శాఖకు చెందిన ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. కొత్తగా సచివాలయం నిర్మాణానికి టెండర్లు పిలిచినా..ఎన్నికలు జరిగే నాటికి ఇవి మొండిగోడల స్థితిలో ఉంటాయే తప్ప..అసలు రూపు కన్పించదు.

దేశంలోనే నదులను అనుసంధానించిన అపరభగీరధుడుగా నిత్యం స్వీయపొగడ్తలతో సాగుతున్న చంద్రబాబుకు భవనాలు కట్టడం ఎందుకు రావటం లేదు?.అంటే దీని వెనక ఎన్నో స్కామ్ ల స్కీమ్ లతోపాటు..రాజకీయ ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయని చెబుతున్నారు. వందల కోట్ల రూపాయలు వెచ్చించి కట్టిన తాత్కాలిక భవనాలు చిల్లులు..జల్లులతో చంద్రబాబు ‘అనుభవం’ పరువును తీసేశాయి. అంత చెత్తగా కట్టినా ఆత్మీయ మంత్రి నారాయణను మాత్రం ఇప్పటి వరకూ నోరెత్తి ఒక్క మాట అన్నది లేదు. అదీ వాళ్ళిద్దరి మధ్య ‘బంధం’. ఇవన్నీ గుర్తుపెట్టుకునే అందుకే మహానాడులో ఎక్కడా పెద్దగా రాజధాని సంగతి ఊసెత్తలేదని టీడీపీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. సింగపూర్ కంపెనీల ముందు ఏపీ సర్కారు మోకరిల్లినా ఆ సంస్థలు ఇంత వరకూ ఎందుకు పనులు మొదలుపెట్టలేదనే విషయాన్ని చంద్రబాబు నోరువిప్పి చెప్పే ప్రయత్నం చేయటం లేదు. పోనీ చంద్రబాబు చెప్పినట్లు కేంద్రం నిధులివ్వనందునే సర్కారు రాజధాని కట్టలేకపోయిందని అనుకుందాం. మరి అన్నీ ఇఛ్చినా సింగపూర్ సంస్థలు ఎందుకు పనులు ప్రారంభించటం లేదు?.

Next Story
Share it