Telugu Gateway
Telangana

ఉత్తమ్ బస్సుయాత్రకు బ్రేక్..అధిష్టానం అసంతృప్తి!

ఉత్తమ్ బస్సుయాత్రకు బ్రేక్..అధిష్టానం అసంతృప్తి!
X

టీపీపీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి బస్సు యాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఇది తాత్కాలికం అవుతుందా? లేక పర్మినెంట్ అవుతుందా? అన్న చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కొత్త రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి తేవాల్సినంత ఊపు తీసుకురావటంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి విఫలమయ్యారనే అభిప్రాయంతో అధిష్టానం ఉన్నట్లు సమాచారం. పార్టీలోని చాలా మంది సీనియర్ నేతలు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు. వాస్తవానికి రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు అయిన మధుయాష్కీని పీసీసీ అధ్యక్షుడిగా చేసి...రేవంత్ రెడ్డికి ప్రచార బాధ్యతలు అప్పగించటానికి పార్టీ రెడీ కాగా...మధుయాష్కీ టీపీసీసీ బాధ్యతలు చేపట్టేందుకు సుముఖంగా లేరని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఉత్తమ్ వ్యవహారశైలితో పార్టీలోని చాలా మంది నేతలు కూడా ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు. అధికార టీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళటంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి అధిష్టానం అంచనాలను అందుకోలేకపోతున్నారని టాక్.

తెలంగాణలో ముఖ్యంగా కాంగ్రెస్ కు సంప్రదాయ ఓటు బ్యాంకు అయిన దళిత, గిరిజన నియోజకవర్గాల్లో లీడర్ షిప్ డెవలప్ మెంట్ మిషన్ కార్యక్రమం చేపట్టాల్సిందిగా అధిష్టానం సూచించినా..ఉత్తమ్ ఈ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టకుండా కేవలం తమ సామాజిక వర్గానికి చెందిన నేతల టిక్కెట్లను మాత్రం ప్రకటిస్తూ ముందుకు సాగుతున్నారు తప్ప..అందరినీ కలుపుకుని పోయే ధోరణి చూపించటం లేదని విమర్శ ఆ పార్టీ నేతల నుంచే వ్యక్తం అవుతోంది. కర్ణాటక రాజకీయ డ్రామాలో భాగంగా కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్ లో ఒక రోజు ఉన్న విషయం తెలిసిందే. అయితే అధిష్టానం ఈ వ్యవహారం అంతా చూసుకునే బాధ్యతను ఉత్తమ్ కు అప్పగించింది. అయితే హోటల్ బుకింగ్స్ తోపాటు..ప్రత్యామ్నాయ రవాణా ఏర్పాట్లు వంటివి అన్నీ ఉత్తమ్ కుమార్ రెడ్డే చూసుకున్నారు. అయితే ఈ బిల్లు మొత్తాన్ని ఆయన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఓ నేతతో కట్టించటం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్ గా మారింది.

పేరు ఉత్తమ్ ది..ఖర్చు ఇతరులదా? అని నాయకులు అవాక్కువుతున్నారు. అంతే కాదు..ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఉత్తమ్ పై అధిష్టానానికి పలు ఫిర్యాదులు వెళ్లినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కర్ణాటకలో కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం, కేబినెట్ కూర్పు పూర్తయిన తర్వాత రాహుల్ గాంధీ తెలంగాణ అంశంపై దృష్టి సారించే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే అధిష్టానం ఉత్తమ్ పై అసంతృప్తితో ఉందనే సంగతి గ్రహించిన నేతలు కొంత మంది టీపీసీసీ అధ్యక్ష పదవి కోసం చివరి ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం. కొత్తగా కాంగ్రెస్ లో చేరిన రేవంత్ రెడ్డి కూడా కొద్ది రోజుల క్రితం ఉత్తమ్ కుమార్ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.

Next Story
Share it