Telugu Gateway
Top Stories

కర్ణాటక కమలానిదే

కర్ణాటక కమలానిదే
X

అత్యంత కీలకమైన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కమలం వికసించింది. ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై ప్రజల్లో పెద్దగా వ్యతిరేకత లేనందున కాంగ్రెస్ పార్టీనే అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందనే అంచనాలు తొలి నుంచి వెలువడ్డాయి. కానీ అనూహ్యంగా బిజెపి పుంజుకుని సొంతంగానే అధికారాన్ని దక్కించుకోవటానికి రెడీ అయిపోవటం విశ్లేషకులను సైతం విస్మయపర్చేలా ఉంది. దేశ ప్రజలు అందరూ అసలు కర్ణాటక ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారు అంటూ ఆసక్తిగా ఎదురుచూశారు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఓ వైపు ప్రధాని మోడీ ఇమేజ్ తగ్గుతుందని ప్రచారం జరగటం ఒకటి అయితే..తర్వలో పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికలు జరగనుండటం మరో కారణం. అయితే కర్ణాటకలో కాంగ్రెస్ గెలిస్తే బిజెపికి పెద్ద సెట్ బ్యాక్ అయ్యేది. కానీ బిజెపి సొంతంగా అధికారం దక్కించుకునే వాతావరణం ఉండటంతో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లోనూ బిజెపినే గెలుస్తుందనే ప్రచారం చేసుకోవటానికి ఆ పార్టీకి మార్గం సుగమం అయింది. అయితే మోడీ వ్యతిరేకత అనేది కర్ణాటకలో ఎందుకు ప్రతిఫలించలేదు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఓట్ల తేడా స్వల్పంగానే ఉన్నా..అంతిమంగా రాష్ట్ర పీఠం ఎవరు దక్కించుకున్నరన్నదే ముఖ్యం కాబట్టి..బిజెపి విజయాన్ని ఎవరు తక్కువ చేసి చూసినా అది తమకు తాము సంతృప్తి పర్చుకునేందుకు చేసుకునే వాదన అవుతుంది తప్ప..దాని వల్ల ఫలితం ఉండదు.

ఎందుకంటే ఇప్పటివరకూ కాంగ్రెస్ పాలనలో ఉన్న కర్ణాటక రాష్ట్రం ఇక నుంచి బిజెపి చేతిలోకి వెళ్లనుంది. ప్రస్తుతానికి బిజెపి 107 సీట్లతో ముందంజలో ఉంది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించటంతో సహజంగానే జెడీఎస్ బిజెపికి మద్దతు ఇస్తుంది. ఈ లెక్కన బిజెపి ప్రభుత్వమే కర్ణాటకలో కొలువుతీరనుంది. కర్ణాటక ఎన్నికలు దేశ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలుగా నిలిచాయని ప్రచారం జరుగుతోంది. పార్టీలు, అభ్యర్థులు పోటీలు పడి ఓటర్లపై కాసుల వర్షం కురిపించారని సెంటర్‌ ఫర్‌ మీడియా స్టడీస్‌ (సీఎంఎస్‌) అనే సంస్థ చెబుతోంది. గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి డబ్బు, మద్యం పంపిణీ విచ్చలవిడిగా జరిగిందని ఈ సంస్థ పేర్కొంది. అయితే కర్ణాటక గెలుపుతో బిజెపిలో జోష్ కన్పిస్తుంటే...కాంగ్రెస్ తీవ్ర నిరాశలో మునిగిపోయింది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విస్తృతంగా ప్రచారం చేసినా...ప్రస్తుత ప్రభుత్వంపై పెద్దగా వ్యతిరేకత లేకపోయినా అధికారాన్ని నిలుపుకోవటంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైంది. కర్ణాటకలో గెలుపు ద్వారా బిజెపి దక్షిణాదిలోకి తిరిగి అడుగుపెట్టినట్లు అయింది.

Next Story
Share it