Telugu Gateway
Andhra Pradesh

‘ప్రభుత్వ లోగో’ పెట్టి మరీ ప్రతిపక్షాలపై వ్యతిరేక పోస్టులు

‘ప్రభుత్వ లోగో’ పెట్టి మరీ ప్రతిపక్షాలపై వ్యతిరేక పోస్టులు
X

సోషల్ మీడియాలో పొలిటికల్ ఫైటింగ్ జోరుగా సాగుతోంది. ఇది కొన్ని సార్లు శృతి మించుతోంది కూడా. ఎవరి పార్టీకి అనుకూలంగా వారు పోస్టులు పెట్టుకోవటం వరకూ ఓకే. అందులో ఎవరికీ వివాదాలు ఉండవు. కానీ ఇప్పుడు ఏకంగా ప్రభుత్వ లోగోను వాడుతూ ప్రతిపక్షాలపై నిత్యం విమర్శలు చేస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘7 మిషన్స్ ఫర్ సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్’ పేరుతో ఉన్న ఫేస్ బుక్ పేజీలో అన్నీ జనసేన, వైసీపీలకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు. తెలుగుదేశం పార్టీ ఈ పనిచేస్తే ఎవరూ అభ్యంతర పెట్టాల్సిన అవసరం ఉండదు. ఆయా పార్టీలు ఈ వ్యవహారం చూసుకుంటాయి. కానీ ఇది ఏపీ ప్రభుత్వ అధికారిక ఫేస్ బుక్ పేజీ అని ఉంది. అందులో ఈ మిషన్లకు సంబంధించిన అంశాలు ఏమీ లేవు కానీ ఓ వెబ్ సైట్ జనసేన, వైసీపీ నేతలపై చేసే విమర్శలకు చెందిన పోస్టులు అన్నీ భారీ ఎత్తున ఉన్నాయి.

ఇది చూసిన అధికార వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. రాజకీయంగా ఏ పార్టీ వారు ఎలా తిట్టుకున్నా ఎవరికీ అభ్యంతరం ఉండదని..కానీ ఏకంగా ప్రభుత్వ లోగో పెట్టి మరీ విపక్షాలపై బురదజల్లే పనిచేయటం సరికాదని ఓ అధికారి వ్యాఖ్యానించారు. నంద్యాల ఉఫ ఎన్నికల సమయంలో ఇంటెలిజెన్స్ సర్వే అని ప్రభుత్వ లోగో ఉన్న లెటర్ వాడినందుకు ఓ వెబ్ సైట్ ఎడిటర్ ను పోలీసులు అరెస్టు చేశారు. కానీ ఇప్పుడు ఓ వెబ్ సైట్ కేవలం ప్రతిపక్షాలపై విమర్శలు చేసేందుకు ప్రభుత్వ లోగోతోపాటు... 7 మిషన్స్ అధికారిక పేజీని ఎలా వాడుతుంది అన్నది పెద్ద చర్చనీయాంశంగా మారింది.

Next Story
Share it