Telugu Gateway
Andhra Pradesh

నారా లోకేష్ కోసం అన్ని వ్యవస్థలా!

నారా లోకేష్ కోసం అన్ని వ్యవస్థలా!
X

నారా లోకేష్. ఏపీ ఐటి, పంచాయతీరాజ్ శాఖల మంత్రి. అయితే ఐటి విభాగంలో నారా లోకేష్ కోసం ఎంత మంది పనిచేస్తున్నారో తెలుసా?. ఆయన కోసం ఎన్నో వ్యవస్థలు ఉన్నాయి. ఐటి శాఖ కోసం తెరవెనక ఉండి పనిచేసే వారు చాలా మంది ఉన్నారు. అయితే క్రెడిట్ క్లెయిం మొత్తం నారా లోకేష్ తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో ఎన్నడూలేని రీతిలో ఐటి శాఖకు ఇద్దరు సలహాదారులు ఉన్నారు. ఒకరు జె. సత్యనారాయణ అయితే...మరొకరు జె ఏ చౌదరి. అయితే వీరిద్దరూ మొదటి నుంచి ఉన్నారు. మరో వైపు ఏపీఎన్ ఆర్ టి కూడా ఏపీకి ఐటి కంపెనీలను ఆకర్షించే పనిలో ఉంది. గతంలో ఏపీఎన్ఆర్ టి కొన్ని చిన్న కంపెనీలను ఏపీకి తీసుకురావటం...వాటిపై వివాదాలు తలెత్తటం తెలిసిందే. ఏపీఎన్ఆర్ టి ప్రెసిడెంట్ అండ్ సీఈవో వేమూరి రవికుమార్ మంత్రి లోకేష్ కు అత్యంత సన్నిహితుడు అన్న సంగతి తెలిసిందే. ఎపీఎన్ ఆర్ టి ఓ వైపు ఐటి కంపెనీలు ఆకర్షిస్తున్నామని చెబుతుంటే..మరోవైపు ఏపీ ఎకనమిక్ డెవలప్ మెంట్ బోర్డు (ఏపీఈడీబీ) ఐటి టాస్క్ ఫోర్స్స్ కూడా అదే పనిలో ఉంది.

తాజాగా ఈడీబీ అమరావతిలో కొత్తగా కట్టే ఐటి టవర్ 45 కంపెనీలను ఆకర్షించినట్లు చెబుతున్నారు. దీంతో పాటు ప్రత్యేక టీమ్ లు పెట్టి కూడా పనిచేస్తున్నారు. వీరితో పాటు ఏపీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటి ఏజెన్సీ అనే ఓ విభాగాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఓ వైపు రాష్ట్రానికి ఐటి కంపెనీలు ఆకర్షించేందుకు ఇన్ని వ్యవస్థలు పనిచేస్తున్నా..ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ లు పదే పదే విదేశీ పర్యటనలు చేస్తున్నా..పెద్దగా చెప్పుకోదగ్గ సంస్థలు ఏమీ ఏపీకి రావటం లేదు. అమెరికా పర్యటనకు పోతే తమకు అసలు కొన్ని కంపెనీలు టీ కూడా ఇవ్వలేదని..కేవలం మంచినీళ్ల బాటిల్ ఇచ్చారని ఈ మధ్య లోకేష్ సెలవిచ్చారు. కానీ వైజాగ్ ఫిన్ టెక్ కోసమే అంటూ ఐటి శాఖ కెపీఎంజీకి నాలుగు కోట్ల రూపాయలు చెల్లించింది. దీనికి తోడు ఐటి ప్రమోషన్ పేరుతో కోట్లాది రూపాయలు సర్కారు ఖర్చు చేస్తోంది. అయినా మూడు, నాలుగు ప్రతిష్టాత్మక సంస్థలు తప్ప..పెద్దగా పేరున్న కంపెనీలను ఏపీకి తీసుకురావటంలో ఐటి శాఖ విఫలమైందని ఆ శాఖ వర్గాలే చెబుతున్నాయి. ఖర్చు మాత్రం కోట్ల రూపాయలు చేస్తున్నారని ఓ అధికారి తెలిపారు.

Next Story
Share it