Telugu Gateway
Telangana

‘పెద్దల చేతిలో’ బందీ అయిన సినీ పరిశ్రమ!

‘పెద్దల చేతిలో’ బందీ అయిన సినీ పరిశ్రమ!
X

రాజకీయాల కంటే సినీ పరిశ్రమలో వారసత్వం ఊడలు దిగింది. రాజకీయాల్లో రిజర్వేషన్ల కారణంగానే...లేక మరో కారణంగానో ఇతరులకు సీట్లు ఇవ్వక తప్పనిసరి పరిస్థితి. అయితే రిజర్వుడ్ సీట్లలోనూ తర్వాత కొత్త వారికి అవకాశం వస్తుందనుకుంటే పొరపాటే. మళ్ళీ తొలుత ఎవరు అయితే సీటు దక్కించుకున్నారో వారి తనయుడో...తనయో రంగంలో ఉంటారు. అదేంటి అంటే...ప్రజలు ఆమోదిస్తున్నారు కాబట్టి తప్పేం కాదంటున్నారు. ఇక సినిమా పరిశ్రమలో అయితే...ముఖ్యంగా హీరోల విషయం చూసుకుంటే 95 శాతంపైగా వారసులే. అలనాటి టాప్ హీరోలు అయిన ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ ప్యామిలీల నుంచి, వారి తర్వాత వచ్చిన చిరంజీవి, నాగార్జున ఫ్యామిలీల వరకూ అదే పరిస్థితి. అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు పది కోట్ల మంది ఉంటే..అందులో ‘హీరో’ మెటీరియల్ కు పనికొచ్చే వారే లేరా?. అంటే..ఖచ్చితంగా కాదనే చెప్పొచ్చు. ప్రస్తుత నటుల కంటే ఎంతో మెరుగ్గా నటించగలిగే వారు వందల సంఖ్యలో ఉంటారు. అయితే పరిశ్రమలోకి ప్రవేశించటం అంత తేలికైన వ్యవహారమేమీ కాదు. ఎందుకంటే సినిమా పరిశ్రమ అంతా ‘పెద్దల నియంత్రణ’లో ఉంది. ఎవరైనా ఓ మంచి కథతో సినిమా చేసినా..దాన్ని విడుదల చేయాలన్నా కూడా పెద్దల సహకారం లేనిదే సాధ్యంకాని పరిస్థితి. లేదంటే థియేటర్లు దొరకవు. పొరపాటున దొరికినా..పెద్ద హీరో సినిమా ఏదైనా వచ్చింది అంటే దాన్ని వెంటనే ఎత్తేస్తారు. దీంతో ఆ సినిమా కష్టాల్లో పడిపోతోంది. ప్రస్తుతం టాలీవుడ్ లోని టాప్ హీరోల్లో అందరూ వారసత్వపు వాసనలు ఉన్నవారే. పరిమిత సంఖ్యలో మాత్రమే ఎలాంటి వారసత్వం లేకుండా కొంత కాలం అయినా ముందుకు సాగగలుగుతున్నారు. పైకి అంతా సాఫీగా ఉన్నట్లే కన్పించినా..ఎవరి రాజకీయం వారిదే.

కాస్టింగ్ కౌచ్ బాధితులు కేవలం చిన్న చిన్న మహిళా నటులే అనుకుంటే పొరపాటేనని... కొంత మంది హీరోయిన్లు కూడా ఈ తరహా సమస్యలు ఎదుర్కొన్న వారే అని సినీ రంగానికి చెందిన ప్రముఖుడు ఒకరు తెలిపారు. అయితే అవి అంత తొందరగా బయటకు రావు. ముఖ్యంగా విదేశాల్లో షూటింగ్స్ ఉన్నప్పుడు..దేశంలోనే ఔట్ డోర్ ప్రాంతాలకు వెళ్లినప్పుడు కొంత మంది ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొనే వారని..అయితే నిర్మాతలే ఎలాగోలా పరిస్థితిని చక్కదిద్దేవారని ఆయన వెల్లడించారు. తాజాగా తన అద్భుత నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఓ హీరోయిన్ కూడా ఇలాంటి ఇబ్బందే ఎదుర్కొన్నట్లు టాలీవుడ్ టాక్. పరిశ్రమలోని బడాబడా నిర్మాతలు అందరూ ఇప్పుడు ఎంతో ఉదార హృదయంతో మహిళలకు డ్రెస్ ఛేంజ్ చేసుకునే సౌకర్యాలు..టాయిలెట్ సౌకర్యాలు కల్పిస్తారన్నమాట. ప్రస్తుతం జరుగుతున్న రచ్చ జరగకపోతే ఈ విషయం టాలీవుడ్ టాప్ నిర్మాతలకు తెలియదా?. టాప్ హీరోలకు తెలియదా?. అంటే ఎవరూ నోరెత్తరన్న మాట. ఏ రంగాన్ని ఎంచుకున్నా అందులో కొనసాగాలనుకుంటే అప్పటికే అక్కడ ఉన్న పరిస్థితులపై పోరాడగలిగే వారు కొద్దిమంది మాత్రమే ఉంటారు? లేదు..కాదు అని గట్టిగా మాట్లాడితే ఆ క్షణమే బయటికిపోవాల్సి ఉంటుంది. ఇది అన్ని రంగాల్లో ఉన్న..అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే.

Next Story
Share it